Home Politics Andhra Pradesh మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బర్రె కొండబాబు ఆగ్రహం

మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బర్రె కొండబాబు ఆగ్రహం

0

శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుపై రాష్ట్ర మంత్రి అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలు సభా మర్యాదలకు విరుద్ధమని రాజమండ్రి నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు విమర్శించారు. ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజును మతపరంగా సంబోధించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ ఆక్షేపణలు ఉంటే నేరుగా ఆయననే ప్రశ్నించాలే తప్ప శాసనమండలి చైర్మన్‌ను లక్ష్యంగా చేసుకోవడం తగదని పేర్కొన్నారు. దళిత నాయకులు ఉన్నత పదవుల్లో ఉండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటన సమయంలో మోషేన్ రాజు హుందాగా వ్యవహరించడం అభినందనీయమని కొండబాబు చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై శాసనమండలిలో ఆయన చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకమని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఎస్సీల జనాభా 16.2 శాతం ఉన్నప్పటికీ కేవలం 15 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయని, వాటిని కూడా మతం పేరుతో తగ్గించే ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై త్వరలో రాష్ట్రపతి మరియు నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కొండబాబు తెలిపారు. అలాగే అన్ని పార్టీలకు అతీతంగా దళితులు ఈ వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version