ఈ నెల 26,27,28 తేదీల్లో జరనున్న రాష్ట్ర గిరిజన జాతరైన శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరలో భద్రత ఏర్పాట్లను పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి వంగలపూడి సోమవారం నాడు పరిశీలించారు. ఈ ఏడాది శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశాలు ఉన్నందున భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టే చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఆమె సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , మక్కువ ఎం వెంకటరమణతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలో ఏ ఒక్క భక్తునికి ఇబ్బంది కలగకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టేందుకు పోలీస్ శాఖ వ్యూహ రచన చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వనం గుడి వద్ద భక్తులు అమ్మవారిని దర్శించుకునే క్యూ లైన్ ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే చదురు వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు పరిశీలించి తగు సూచనలు చేశారు. భక్తులతో పోలీస్ సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. మక్కువ, చెముడు, ఎస్. పెద్ద వలస, సాలూరు నుండి వచ్చే వివిధ వాహనాలు నిలుపుదల చేయకుండా పార్కింగ్ ప్రదేశాలను ఆమె పరిశీలించారు.
శంబర గ్రామానికి వచ్చే రహదారుల్లో జంగిల్ క్లియరెన్స్ త్వరిగతిన చేపట్టేలా ఆర్ అండ్ బి శాఖ అధికారులకు సూచనలు చేయాలని దేవాదాయ శాఖ సిబ్బంది ని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా తగు ప్రణాళికలు రూపొందించాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వెంట ట్రస్ట్ బోర్డు చైర్మన్ నై దాన. తిరుపతిరావు, సాలూరు రూరల్ సీఐ పి రామకృష్ణ, మక్కువ ఎస్ఐ, ఎం వెంకటరమణ, ఆలయ కార్య నిర్వహణ అధికారి బి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
