ఫిబ్రవరి 1 న విజయవాడలో ఏసీ సాంకేతిక నిపుణుల బహిరంగ సభ
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వినతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏసీ సాంకేతిక నిపుణులకు కార్మికహక్కులు కల్పించాలి, వారి సమస్యలు పరిష్కారించాలని విశాఖ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా ప్రసాద్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ను కోరారు. ఈ మేరకు అసోసియేషన్ తరుపున వినతి పత్రం ఎమ్మెల్యే కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విశాఖ లో ఏసీ (ఎయిర్ కండిషనర్) కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏసీ పనుల్లో ఉన్న కార్మికులకు సరైన భద్రతా చర్యలు లేకపోవడం, ప్రమాదాల సమయంలో బీమా సదుపాయం లేకపోవడం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య పరిరక్షణ,
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలానే ఏసీ కార్మికుల సమసులను ప్రభుత్వ దృష్టి కి తీసుకువచ్చేలా ఫిబ్రవరి 1 న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆత్మ గౌరవ సభ పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ గోడ పత్రిక ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ ఏసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏసీ కార్మిక సంఘ నాయకులు నాగేశ్వరరావు, వినయ్, బాబు, రవి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
