మాడుగుల మండలం కేజే పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. 14 ఏళ్లు నిండిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. భవిష్యత్తులో వారికి అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపీపీ టీవీ రాజారాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పిహెచ్సి పరిధిలో గల 14 ఏళ్ళు నిండిన ప్రతి బాలిక ఈ టీకా కార్యక్రమంలో పాలుపంచుకునే విధంగా సిబ్బంది తగు చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా 23 మంది బాలికలకు తొలి రోజు హెచ్పీవీ టీకా వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 24o మంది బాలికలకు 90 రోజుల వ్యవధిలో ఈ టీకా వేయాల్సి ఉంది. సెలవు దినాలు మినహా మిగిలిన అన్ని రోజులు ఆరోగ్య కేంద్రంలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జామి రమణబాబు, పిహెచ్సి వైద్యాధికారి ప్రసాద్ పాత్రుడు, సిహెచ్ఓ కే సుజాత సిబ్బంది పాల్గొన్నారు
