Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradesh“రాష్ట్రంలో నెయ్యి కల్తీ… పాలు కల్తీ… బాబు హామీలు కూడా కల్తీ!”

“రాష్ట్రంలో నెయ్యి కల్తీ… పాలు కల్తీ… బాబు హామీలు కూడా కల్తీ!”

– ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపాటు
రాష్ట్రంలో చోటుచేసుకున్న కల్తీ పాలు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం, గిడుగు రుద్రరాజు తదితరులతో కలిసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. “రాష్ట్రంలో నెయ్యి కల్తీ… పాలు కల్తీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా కల్తీనే” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు నమ్మకంతో వినియోగించే పాలు వంటి ప్రాథమిక ఆహార పదార్థాల్లోనే కల్తీ జరుగుతుండటం ఆందోళనకరమని ఆమె అన్నారు. కల్తీ పాల ఘటనపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన షర్మిల, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోండా వెంకట్, మాజీ డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments