Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshకల్తీ పాలు ఘటన ప్రభుత్వ వైఫల్యమే: మాజీ ఎంపీ భరత్ రామ్

కల్తీ పాలు ఘటన ప్రభుత్వ వైఫల్యమే: మాజీ ఎంపీ భరత్ రామ్

కల్తీ పాలు తాగి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. గురువారం రాజమండ్రి రామాలయం సెంటర్‌లో పార్టీ శ్రేణులతో కలిసి మానవహారం నిర్వహించి పాల కల్తీ ఘటనపై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘటన జరిగి 15 రోజులు గడిచినా పాలలో కల్తీ ఎలా జరిగిందన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదని విమర్శించారు. రోజుకో మృతదేహం ఆసుపత్రి నుంచి బయటకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలపై తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.
వేట్లపాలెం ఘటనలో మృతి చెందిన వారికి రూ.20 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం, రాజమండ్రిలో కల్తీ పాలు తాగి మృతి చెందిన వారికి రూ.10 లక్షలు మాత్రమే ప్రకటించడం ఎందుకని ప్రశ్నించారు. అక్కడ ప్రాణమే, ఇక్కడ కూడా ప్రాణమే కాదా అని అన్నారు.
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 13 మందికి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎథిలిన్ గ్లైకాల్ కలిసిందని చెబుతూ యాంటిడోట్ తెప్పించామని పేర్కొన్నారని, అది ఎంతమందికి అందించారో వివరాలు వెల్లడించాలని కోరారు.
కల్తీ పాలు ఘటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తున్నదని ఆయన అన్నారు. చిన్న పాల వ్యాపారులను ప్రోత్సహిస్తూ భద్రతా నియమాలు పాటించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జీలు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments