Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshమనకు ఢోకా లేదు

మనకు ఢోకా లేదు

ఇంధన కొరత రానే రాదు

నిబంధనలు విధించే ఆలోచన లేదు

పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

పెట్రోల్, డీజిల్ నిల్వలపై కేంద్రం స్పష్టీకరణ

దేశంలో ఇంధన కొరత వస్తుందేమో అన్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎలాంటి రోజూ వారి నిబంధనలు విధించే ఆలోచన ఏమీ లేదని, దేశానికి అవసరమైనంత నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సరఫరా వ్యవస్థ బలంగా ఉండటంతో సాధారణ ప్రజలు, పరిశ్రమలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. దేశ ఇంధన భద్రతపై సమీక్షను రోజూ నిర్వహిస్తున్నామని, నిల్వలు రోజూ భర్తీ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, ముడి చమురు సరఫరాలో ఎలాంటి కొరత లేదని చెప్పారు. గ్యాస్ సరఫరాను ప్రాధాన్య రంగాలకు నిరంతరంగా అందించేందుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్‌) అవసరమైతే ఫోర్స్ మేజ్యూర్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. అనుకోని పరిస్థితుల్లో ఒప్పంద బాధ్యతల నుంచి రక్షణ పొందేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుంది. భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాలో కీలక భాగస్వామిగా ఉన్న ఖతార్ ఎనర్జీ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ అవసరాల్లో సుమారు 20 శాతం సరఫరా చేసే ఖతార్‌, భారత్‌కు ప్రతిరోజూ సుమారు 60 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ అందిస్తోంది. మొత్తం 195 ఎంఎంఎస్‌సీఎండీ దిగుమతుల్లో ఇది ఒక భాగమే కావడంతో, ఇతర మార్కెట్ల నుంచి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంధన పరిస్థితిపై ప్రభుత్వం రోజుకు రెండుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, సరఫరా గొలుసులో ఆటంకాలు, రవాణా సమస్యలు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అవసరమైతే తక్షణ నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మొత్తం మీద దేశ ఇంధన భద్రత విషయంలో భారత్ “కంఫర్టబుల్ పొజిషన్”లో ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్ రేషన్, గ్యాస్ కొరత, ధరల షాక్‌లాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం లేదని చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లు, వ్యూహాత్మక నిల్వలు, బహుళ దేశాల నుంచి సరఫరాలు – ఈ మూడు అంశాలు కలిసి భారత్‌కు భరోసా కల్పిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments