సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను పట్టాలెక్కించాలి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో కీలక భేటీ
రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ
న్యూ డిల్లి లోని రైల్ భవన్ ను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలసి, రైల్వే ఆపరేషన్ కంట్రోల్ రూమ్ ఆపరేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు మరింత వేగవంతం చెయ్యాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పలు కీలక ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో వివిధ సర్వీసులకు సంబంధించి ఈ సందర్భంగా కీలకంగా చర్చించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీలక ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ఈ భేటిలో కీలక చర్చ జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషనల్ పనులను మరింత వేగవంతం చెయ్యాలని ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ ను రామ్మోహన్ నాయుడు కోరారు. ప్రస్తుత స్థితిని కూడా అశ్విని వైష్ణవ్ వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా పలు రైళ్లకు, రైల్వే స్టేషన్ల కు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. శ్రీకాకుళం నుండి విజయనగరం మీదుగా సికింద్రాబాద్ చేరేవిధంగా నూతన సర్వీసును ఏర్పాటు చెయ్యాలని ప్రధానంగా రామ్మోహన్ నాయుడు కోరారు. ఇది జిల్లాకు అత్యంత అవసరంగా మారిందని, జిల్లా కనెక్టివిటిని మరింత పెంచుతుందని సర్వీసు ఆవశ్యకతను వివరించారు. వీటితో పాటు.. శ్రీకాకుళం జిల్లాలో కనెక్టివిటీ మరియు రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై పలు ప్రాజెక్టులను రైల్వే శాఖా మంత్రి ఎదుట రామ్మోహన్ నాయుడు ఉంచారు. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్ మరియు తిరుపతికి నేరుగా నూతన సర్వీసుల ఏర్పాటు, మందస రోడ్, పాతపట్నం, హరిశ్చంద్రపురం స్టేషన్లలో కీలక రైళ్లకు సంబంధించి హాల్టుల ఏర్పాటు, కామేశ్వరిపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించారు. ఇందులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం స్టేషన్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి సారించాలని కోరారు. తద్వారా అన్ని రకాలుగా కూడా ఉపయుక్తంగా హరిశ్చంద్రపురం స్టేషన్ మారనుందని అన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల ఏర్పాటు గురించి పలు ప్రాజెక్టులను రైల్వే మంత్రికి వివరించారు. మౌలిక వసతుల విస్తరణ గురించి కూడా భేటిలో ప్రధానంగా తీసువచ్చారు. కంట్రోల్ రూమ్ విభాగాన్ని సందర్శించే సమయంలో కొత్తవలస పలాస సెక్షన్ల మధ్య ట్రైన్ ఆపరేషన్ల వివరాలను రామ్మోహన్ నాయుడుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరింత విపులంగా వివరించారు. గుజరాత్ లో నూతనంగా నిర్మితం అవుతున్న దోహలేరా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంకు రైల్వే లాజిస్టిక్ రవాణాను అనుసంధానం చెయ్యడం పై కూడా ఈ భేటిలో ప్రధానంగా చర్చించారు. రైల్వే తో విమానయాన లాజిస్టిక్స్ రవాణాను అనుసంధానం చెయ్యడం ప్రస్తుతం అత్యంత అవసరమని ఇరువురు మంత్రులు స్పష్టం చేశారు. ప్రధాని మోది వికసిత్ భారత్ లక్ష్యాలను వేగంగా చేరడం కోసం భవిష్యత్ లో విస్తరించబోయే ప్రాజెక్టులలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్-రైల్ కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో రెండు మంత్రిత్వ శాఖల నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
