ప్రపంచ మహాసముద్రాల అగాధాలలో అత్యంత లోతైన ప్రాంతంగా ఛాలెంజర్ డీప్ గుర్తింపు పొందింది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్ దక్షిణ కొన వద్ద ఈ ప్రాంతం ఉంది. సముద్ర మట్టం నుండి దీని లోతు సుమారు పది వేల తొమ్మిది వందల ముప్పై అయిదు మీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఒకవేళ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ అగాధంలో ఉంచినట్లయితే ఆ శిఖరం పైభాగం పైన ఇంకా రెండు కిలోమీటర్ల మేర నీరు ఉంటుంది. అంటే భూమి మీద ఎత్తైన ప్రదేశం కంటే సముద్రంలో లోతైన ఈ ప్రదేశం పరిమాణం చాలా పెద్దది. పందొమ్మిది వందల యాభై ఒకటిలో బ్రిటిష్ నౌక ‘ఛాలెంజర్ 2’ ఈ ప్రాంతాన్ని కనుగొన్నందున దీనికి ఆ పేరు పెట్టారు. ఈ ప్రాంతం కేవలం లోతుకు మాత్రమే కాదు అక్కడి భౌగోళిక పరిస్థితులకు కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఇటువంటి వింతలు మానవ విజ్ఞానానికి ఎప్పుడూ సవాలుగానే నిలుస్తున్నాయి. భూమి ఉపరితలం పై ఉన్న పర్వతాల కంటే సముద్ర గర్భంలో ఉన్న లోయలు ఎంతో భారీగా ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం.
ఛాలెంజర్ డీప్ వద్ద పర్యావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. ఇక్కడ నీటి ఒత్తిడి భూమి ఉపరితలం కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక మనిషిపై సుమారు యాభై జెట్ విమానాలు పడినంత బరువుతో సమానం. ఇంతటి భారీ ఒత్తిడిని తట్టుకుని నిలబడటం ఏ జీవికైనా సామాన్యం కాదు. అలాగే సూర్యరశ్మి ఇక్కడికి అస్సలు చేరదు కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడూ దట్టమైన చీకటితో నిండి ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత కూడా సున్నా నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య అంటే గడ్డకట్టే స్థితికి దగ్గరగా ఉంటుంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులు అలాగే సముద్ర జీవులు జీవించడం ప్రకృతి వింతలలో ఒకటి. ఈ జీవులు అక్కడి తీవ్రమైన ఒత్తిడికి అనుగుణంగా తమ శరీరాలను మార్చుకున్నాయి. సముద్రపు అడుగుభాగంలో ఉండే ఇసుక వంటి మట్టిలో ఇవి ఆహారాన్ని వెతుక్కుంటాయి. ఇక్కడ ఉండే జీవులలో చాలా వరకు కళ్ళు ఉండవు ఎందుకంటే అక్కడ వెలుతురు అస్సలు ఉండదు.
ఈ లోతైన ప్రాంతాన్ని అన్వేషించడానికి మానవుడు అనేక ప్రయత్నాలు చేశారు. పందొమ్మిది వందల అరవైలో డాన్ వాల్ష్ అలాగే జాక్వెస్ పికార్డ్ అనే ఇద్దరు సాహసికులు ‘ట్రైస్టే’ అనే ప్రత్యేక వాహనం ద్వారా మొదటిసారిగా ఇక్కడికి చేరుకున్నారు. ఆ ప్రయాణం సముద్ర అన్వేషణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం వరకు ఎవరూ అక్కడికి వెళ్ళలేకపోయారు. రెండు వేల పన్నెండులో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఒంటరిగా ‘డీప్ సీ ఛాలెంజర్’ అనే జలాంతర్గామిలో ఈ అగాధాన్ని చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇటీవలి కాలంలో విక్టర్ వెస్కోవో వంటి అన్వేషకులు కూడా ఇక్కడికి చేరుకుని అనేక పరిశోధనలు నిర్వహించారు. ఈ అన్వేషణల ద్వారా సముద్రగర్భంలో ఉండే భౌగోళిక మార్పులు అలాగే భూకంపాల గురించి విలువైన సమాచారం లభిస్తోంది. సముద్రాల అడుగున ఉండే అగ్నిపర్వతాలు అలాగే పగుళ్లు భూమి యొక్క అంతర్గత వేడిని బయటకు పంపుతాయి.
ఛాలెంజర్ డీప్ ప్రాంతం భూమి యొక్క పొరలు ఒకదాని కిందకు ఒకటి వెళ్లే స్థితిలో ఉంది. ఇక్కడ పసిఫిక్ ప్లేట్ మరియానా ప్లేట్ కిందకు నెట్టబడుతుంది. దీనివల్ల ఏర్పడిన ఈ భారీ లోయ భూమి యొక్క అంతర్గత నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడుతోంది. ఇక్కడ లభించిన శిలలు అలాగే జీవుల నమూనాలు భూమి పుట్టుక గురించి కొత్త విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇక్కడ కనిపించే అమీబా వంటి ఏకకణ జీవులు పది సెంటీమీటర్ల పరిమాణంలో ఉండటం విశేషం. ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఈ లోతైన ప్రాంతంలో కనిపిస్తుండటం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. మానవుడు సృష్టించిన కాలుష్యం చివరకు సముద్రపు అత్యంత లోతైన భాగాలకు కూడా చేరుకుందని ఇది నిరూపిస్తోంది. సముద్ర పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇది గుర్తు చేస్తోంది.
ఈ అగాధం మానవ విజ్ఞానానికి ఒక గొప్ప పరీక్ష. అంతరిక్షం కంటే సముద్ర గర్భం గురించి మనకు తక్కువ సమాచారం ఉందనేది వాస్తవం. ఛాలెంజర్ డీప్ వంటి ప్రాంతాల అన్వేషణ ద్వారా సముద్రాల ప్రాముఖ్యత అలాగే వాటిని సంరక్షించాల్సిన అవసరం మనకు అర్థమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఈ అగాధాల రహస్యాలను ఛేదించడానికి మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. సముద్ర గర్భంలో ఉండే అపారమైన ఖనిజ సంపద అలాగే జీవవైవిధ్యం మానవ భవిష్యత్తుకు ఎంతో కీలకం. ప్రపంచంలోనే అత్యంత లోతైన ఈ బిందువు ప్రకృతి యొక్క అనంతమైన శక్తికి చిహ్నంగా నిలుస్తోంది. సముద్రాలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు అవి భూమి మీద ప్రాణకోటి మనుగడకు ప్రధాన ఆధారం. ఇటువంటి అగాధాలను అధ్యయనం చేయడం ద్వారా మనం వాతావరణ మార్పులను కూడా అంచనా వేయవచ్చు. ఛాలెంజర్ డీప్ అనేది సముద్ర శాస్త్రవేత్తలకు ఒక ప్రయోగశాల వంటిది. ఇక్కడ జరిగే ప్రతి ఆవిష్కరణ మానవాళికి ప్రకృతిపై ఉన్న అవగాహనను పెంచుతుంది. భూమిపై అత్యంత మారుమూల మరియు రహస్య ప్రదేశంగా ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది.
(సి.హెచ్.ప్రతాప్)
