Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshపేరు మార్పుపై దుమారం

పేరు మార్పుపై దుమారం

ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలి – గరికపాటి

అడిగే వారు లేరని అధిక ప్రసంగం – కమలానంద భారతి

ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి తీవ్రంగా స్పందించారు. తాజా వివాదంపై ఆయన సోమవారం వీడియో విడుదల చేశారు. వింత పోకడలు, వింత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదని ధ్వజమెత్తారు. మహా సంకల్పంలో అంగ, వంగ, కళింగ, సౌరాష్ట అని చెప్పుకునే క్రమంలో కేరళ, ద్రవిడ, ఆంధ్రా అని వస్తుందని వివరించారు. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉందని.. దానికి ఆంధ్రా అనే పేరు ఉందని ప్రస్తావించారు. ఆంధ్ర మహాభారతం, ఆంధ్రభాగవతం రాశారని కమలానంద భారతి తెలిపారు. అడిగి వారు లేరని తెలివి, పాండిత్యం, అధిక ప్రసంగం ఎక్కువయ్యి తెలుగు భాగవతం, తెలుగు భారతం జరుపుకుంటున్నారని అన్నారు. మాజీ సీఎం నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారని.. ఆయన నినాదం ఆంధ్రుల ఆత్మగౌరవమని ఉద్ఘాటించారు. రాష్ట్రాల విభజన జరిగిందని.. మానసికంగా అందరం కలిసే ఉన్నామని చెప్పుకొచ్చారు. సంస్కృతాంధ్ర అనాలి తప్ప.. సంస్కృత తెలుగు అనేది దుష్ట సమాసమని నన్నయభట్టు చెప్పారని ప్రస్తావించారు. శాతవాహనులు, అనేకులు ఆంధ్రులు అనే చదువుకున్నారని తెలిపారు. ఆంధ్ర అనే పదం అనకూడదనేలా కొందరు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

గరికపాటికి ఆ నైతిక బాధ్యత లేదు..
గరికపాటి ఆంధ్రకు రారని.. తెలంగాణలో స్థిరపడ్డారని కమలానంద భారతి గుర్తుచేశారు. వేసవి, సంక్రాంతి సెలవులకు, వచ్చి 5 కోట్లు మంది ఎలా ఉండాలో చెప్పే నైతిక బాధ్యత ఆయనకు లేదన్నారు. ఏపీ అంటే తెలుగు కాదా అని ప్రశ్నించారు. నాడు, ప్రదేశ్ అనేది సంస్కృత పదం కాదా అని నిలదీశారు. ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారని ఆగ్రహించారు. నాలుగు జిల్లాలకు రాయలసీమ అనే పేరు పెట్టే పరిస్థితులు తెచ్చారని తెలిపారు. విచ్ఛిన్నకర పరిస్థితులు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రాంతం, తమ బతుకులు ఎలా ఉండాలో తమకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఎక్కడో ఉండే గరికపాటి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వొద్దని హితవు పలికారు. తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఉంటామని.. ఎవ్వరు వేలు పెట్టొద్దని కమలానంద భారతి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు తమ పేర్లను మారుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును ఎందుకు మార్చకూడదని ఆయన ప్రశ్నించారు. తెలుగునాడుగా మార్చాలనేది ఎన్టీ రామారావు ఆశయమని, ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని గరికపాటి అభిప్రాయపడ్డారు. పేరు మార్పు వల్ల ఏపీ ప్రజల బతుకులు మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments