Sunday, May 31, 2026
HomePoliticsAndhra Pradeshగంజాయి కట్టడికి స్వతంత్ర కమిషన్ డిమాండ్

గంజాయి కట్టడికి స్వతంత్ర కమిషన్ డిమాండ్

హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు తీర్మానం
– భారీగా హాజరైన మేధావులు
– సుధీర్ఘ ప్రసంగాలు చేసిన ప్రొఫెసర్లు

అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో గంజాయి కట్టడికి తీసుకోవాల్సిన అంశాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలని ఏక గ్రీవంగా తీర్మానం చేశారు.
మన రాష్ట్రం లో గంజాయి ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. ఆనందంగా గడుపుతున్న కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఎంతో మంది యువతీ యువకుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. తన, మన అనే విచక్షణ లేకుండా సహనాన్ని కోల్పోయి సంఘ విద్రోహు శక్తులుగా యువతను మార్చేస్తోంది. గతంలో సిగరెట్ రూపంలో మాత్రమే ఉంటే గంజాయి నేడు చాక్లెట్లు,ఫెవికిక్ రూపంలో పాఠశాలలు కళాశాలల దగ్గర్లో లభ్యమవడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులను టార్గెట్ చేసి తమ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో గంజాయి ముఠాలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అభం, శుభం తెలియని పిల్లల్ని సైతం బలి తీసుకుంటోంది. ఇందుకు మదనపల్లి ఘటన ఒక ఉదాహరణ. గంజాయి మాఫియా తమకు అడ్డొచ్చిన వారిని భౌతికంగా దాడులు చేయడమే గాక ప్రాణాలు తీసే సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు నెల్లూరు సామాజిక కార్యకర్త పెంచలయ్య దారుణ హత్యే ఒక ఉదాహరణ. మన ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫలానా చోట గంజాయి పట్టుబడిందన్న వార్త లేని రోజు లేదంటే ఆశ్చర్య పడాల్సి వస్తోంది. ప్రభుత్వాలు మారినా డ్రగ్ మాఫియా తీవ్రతలో మార్పు లేదు. చెక్ పోస్టులు , ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీసు , ఈగల్ వ్యవస్థ … ఇన్ని ఉండగా గంజాయి రాష్ట్ర మంతటా ఎలా వ్యాప్తి చెందుతోందన్న సందేహం ప్రజలందర్నీ వెంటాడుతోంది. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు గంజాయి వ్యాప్తిని నిరోధించలేకపోతున్నాయి. రవాణా చేస్తున్నవారిని, అమ్ముతున్నవారిని పట్టుకుని శిక్షించడం ఒకటే చేస్తే ప్రయోజనం లేదని అనుభవాలు తెలుపుతున్నాయి. తామర తంపర్లాగా ప్రతీ నిత్యం కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇందుకు మూల కారణాలేంటి? ఎక్కడ సాగు అవుతోంది? ఎవరు దీని వెనకాతల ఉండి నడిపిస్తున్నారు లాంటి మూల కారణాల్లోకి వెళితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఇందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం క్రింది చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తోంది.
* ఒక ప్రజా ఉద్యమంగా ప్రజల సహకారంతో గంజాయి కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
– ఎస్సీ ఎస్టీ లపై జరిగే ఎట్రాసిటీలను కట్టడి చేయడానికి 2001లో రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పరిచిన రీతిలో గంజాయిని కట్టడి చేయడానికి ఒక స్వతంత్ర కమిషన్ ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి.
– ఈ కమిషన్ కు స్టాట్యూటరీ స్టేటస్ కల్పించాలి.
– ఈ కమిషన్ గంజాయి నిర్మూలనకు, మాదక ద్రవ్యాల చట్టం అమలుకు సంబంధించిన సిఫార్సులు చేస్తుంది.
* నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ మొదలైనవారు గంజాయి ప్రోన్ ఏరియాల్లో పర్యటించి ప్రతీ నెలా 30 వ తేదీన కలెక్టర్ పబ్లిక్ హియరింగ్ చేపట్టాలి. స్పెషల్ కోర్టులు పెట్టి నేరస్థులను శిక్షించాలి.
* మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టంలోని లొసుగులను సరిచేసి చట్టాన్ని మరింత పటిష్ఠ పరచాలి.
* దీంతోపాటు స్కూళ్లు, కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలి.మాదక ద్రవ్యాలపై కౌన్సిలింగ్ తప్పనిసరి చేయాలి
– గంజాయి పండించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* చట్టం ముందు ఎవరికీ మినహాయింపు లేని రీతిలో ప్రభుత్వం వ్యవహరించాలి.
– గంజాయితో సంబంధం ఉన్న వారందరినీ బాధ్యతల నుండి తొలగించాలి
– ప్రభుత్వం పోలీసులు తల్లిదండ్రులు పౌర సమాజం కలిసి పనిచేసేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments