దేవ్ జీ, రాజిరెడ్డి సహా 16 మంది
నేడో, రేపో పోలీసుల ప్రకటన
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర అగ్రనేతలు దేవ్ జి, రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్ట్ అగ్రనేతలు పలువురు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు అదే స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. రెండు నెలల క్రితం ఆసిఫాబాద్ అడవుల్లోని సిర్పూర్ యు అడవి ప్రాంతంలో 16 మంది మావోయిస్టులు లొంగిపోగా.. తాజాగా రాష్ట్రస్థాయి మావోయిస్టుల అగ్రనాయకత్వం జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. పోలీసులు రెండు రోజుల్లో మీడియా ముందుకు దేవ్జీ, రాజిరెడ్డిలను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ అడవులలో లొంగిపోయిన కేంద్ర మావోయిస్టు ప్రధాన పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు, కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మంది కలిసి లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో సురక్షితంగా ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఆసిఫాబాద్ కాగజ్ నగర్ అటవీ ప్రాంతాలు తమ ప్రాబల్యాన్ని కోల్పుతున్నాయి. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతలు దేవుజీ, రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు ఆసిఫాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారని ప్రచారం జరుగుతోంది.
