ముగ్గురు అరెస్ట్ – రూ.1.45 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
కొవ్వూరు రూరల్ పోలీసుల అప్రమత్తతతో దొంగ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం ఐదుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
అరెస్టైన వారిలో గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురానికి చెందిన శేఖర్, జంగారెడ్డిగూడెంకు చెందిన లాగు శ్రీను, కొవ్వూరు నియోజకవర్గం చాగల్లుకు చెందిన బొలిపో తేజ ఉన్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.1,45,500 విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో నిందితులకు ఈ దొంగ నోట్లు ఆన్లైన్ మార్గం ద్వారా అందుతున్నట్లు బయటపడింది. నకిలీ కరెన్సీ సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఆపరేషన్ను కొవ్వూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
దొంగ నోట్లు చలామణి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అపరిచితుల నుంచి కరెన్సీ స్వీకరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
కొవ్వూరు రూరల్లో దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు
RELATED ARTICLES
