Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradesh“రాజ్యంలో రాజ్యాంగం కాదు… రెడ్‌బుక్ దందా!”

“రాజ్యంలో రాజ్యాంగం కాదు… రెడ్‌బుక్ దందా!”

అంబటి అరెస్ట్‌పై మండిపడ్డ గుడివాడ అమర్నాథ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతునులిమేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి ములాఖాత్ ద్వారా కలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఘటనలో అసలు దుండగులు బహిరంగంగా తిరుగుతుంటే, బాధితుడినే జైలుకు పంపించడం న్యాయవ్యవస్థను రాజకీయాలకు బలి చేసినట్టేనని ఆరోపించారు. రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదని, “రెడ్‌బుక్ రాజ్యాంగం” పేరిట కక్షసాధింపుల పాలన నడుస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే అంబటిని లక్ష్యంగా చేసుకున్నారని, ఇది రాజకీయ ప్రతీకారానికి పరాకాష్ట అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలు, మౌనం పాటిస్తేనే రక్షణ అనే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల బారిన పడేసి ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు తీసుకున్నా అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రశ్నించారు. రైతులు నష్టాల్లో కూరుకుపోతుంటే, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం మాత్రం ప్రచార హడావుడికే పరిమితమైందని మండిపడ్డారు.
“ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రజలదే. అణచివేతకు ప్రతిచర్య తప్పదు” అంటూ హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే కక్షపూరిత రాజకీయాలను ఆపి, చట్టపరమైన పరిపాలనకు తిరిగి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు గూడూరి శ్రీనివాస్, విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ చైర్మ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments