ఐక్యతను దెబ్బతీస్తే సహించం
కోవా బన్ టేస్ట్ చేస్తా
కొందరి ఆరోపణలు సరికాదు
బన్ వ్యాపారి వలీకి మంత్రి లోకేశ్ భరోసా
కర్నూలుకు చెందిన కోవా బన్ చిరు వ్యాపారి వలీకి మంత్రి నారా లోకేష్ తన మద్దతును ప్రకటించారు. త్వరలోనే వలీని స్వయంగా కలుస్తానని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వలీ తయారుచేసే కోవా బన్ రుచి చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. అయితే ఇటీవల ఆయనపై కొందరు చేసిన ఆరోపణలు తనను కలచివేశాయంటూ లోకేష్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. సమాజంలో ఐక్యతను దెబ్బతీసే ఇటువంటి ప్రవర్తనలకు తావులేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వలీ వంటి చిన్న వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు వలీని కలిసి ఆయనకు ధైర్యం చెప్పడమే కాకుండా, ఆయన వ్యాపారానికి పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ పేర్కొన్నారు.
కర్నూలులో వలీ అనే వ్యక్తి రోడ్డు పక్కన బండిపై ‘కోవా బన్’ అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. అయితే, ఇటీవల మేడారం జాతరలో కోవా బన్ విక్రయించాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకుని, ఆయన వద్ద కోవా బన్ కొనవద్దంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగారు. కొందరు వ్యక్తులు ఆ కోవ్ బన్ నువ్వు తింటావా, తిని చూపించు అని సైతం అడిగారు. చిరువ్యాపారి వలీ ఆ కోవా బన్ అందరి సమక్షంలో తిని కూడా చూపించాడు. అంత తక్కువ ధరకు కోవా బన్ అంటే అందులో కల్తీ జరిగిందని, ఎవరూ తినవద్దని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కేవలం విద్వేషం వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఒక చిన్న వ్యాపారి పొట్ట కొట్టేలా కొందరు వ్యవహరించడం స్థానికంగా, రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు వలీకి మద్దతు తెలిపి, నాణ్యత బాగుంటే అతడి వద్దే కొని తింటామని సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ విద్వేషపూరిత ప్రచారాన్ని ఖండిస్తూనే మంత్రి నారా లోకేష్ వలీకి మద్దతుగా నిలిచారు. త్వరలోనే అతడ్ని కలిసి వలీ చేసిన కోవా బన్ రుచి చూస్తా అన్నారు.
