లడ్డూ కల్తీ పేరుతో సీఎం వికృత చేష్టలు
– శ్రీవారి భక్తుల మనోభావాలతో కూటమి ఆటలు
– తిరుమలపై చంద్రబాబు దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదు
– హెచ్చరించిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు జిల్లా కెకె రాజు , తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విశాఖపట్నం జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తన అసమర్థత బయట పడకుండా ఏడాదిన్నరగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నాడని, శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూడటం సిగ్గచేటన్నారు. తిరుమలపై చంద్రబాబు, పవన్ కళ్యాన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా టీటీడీ రిజెక్టు చేసిన ట్యాంకర్లు దొడ్డి దారిన ఎలా ప్రవేశించాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బోలేబాబా డెయిరీకి కూడా గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతి లభించిందని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో 2019 ఏప్రిల్ లో 82 వేల కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై సీబీఐ సిట్ చార్జిషీట్ లో అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
● ఆలయ ప్రతిష్టను దిగజార్చారు
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఏడాది క్రితం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన సీబీఐ సిట్ చార్జిషీట్ తప్పని తేల్చడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తప్పును చేశామని అంగీకరించి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. అబద్ధాన్ని నిజం చేయడమే లక్ష్యంగా మరిన్ని తప్పులు చేస్తున్నారు. ఏకంగా కేబినెట్ మొత్తాన్ని మీడియా ముందుకు పంపించి శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు. దేవుడితో ముడిపడిన సున్నితమైన అంశాన్ని పట్టుకుని వికృత రాజకీయాలకు తెరదీయడం సిగ్గుచేటు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రోజుకో కట్టు కథలు ప్రచారం చేస్తూ ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారు. లడ్డూకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలిసిందని మొన్నటిదాకా ప్రచారం చేసిన కూటమి నాయకులు.. కొత్తగా పామాయిల్, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయంటూ తిమ్మిని బమ్మిని చేసే కుట్రకు తెరదీశారు.
● హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్
అధికారంలో ఉన్న చంద్రబాబు తన వద్ద ఉన్న వ్యవస్థలతో విచారణ జరిపించి ఎవరైనా తప్పు చేసి ఉంటే న్యాయ స్థానాల్లో శిక్షలు పడేలా చేయకుండా రోడ్డెక్కి తప్పు ప్రచారం చేయడం, తనకు అనుకూల పత్రికలు, టీవీలలో ఊదరగొట్టడం, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, కరపత్రికల ద్వారా తిరుమల ప్రతిష్టకు నష్టం వాటిల్లేలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు చంద్రబాబుకి ఎవరిచ్చారు? చంద్రబాబు చేసిన మహాపచారం తెలుగుదేశం పార్టీకి అంటుకుని ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేకుండా పోతుందనే భయంతో పాపాన్ని జనసేన, బీజేపీకి అంటించడానికే ప్రెస్మీట్ పెట్టించాడు. కానీ అక్కడ కూర్చున్న వారందరిలోనూ తప్పు చేశామన్న భావన కనిపిస్తోంది. దేవుడితో ఆటలాడుకుంటున్నామన్న అపరాధం కనిపిస్తోంది. స్వామీజీలు, పీఠాధిపుతులు భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించే చంద్రబాబు మోసాలను ఇకనైనా గుర్తించి ఆయన్ను ప్రశ్నించాలి. తన అసమర్థ పాలన నుంచి ఎన్నికల హామీలు అమలు చేయలేని చేతకాని తనం నుంచి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేయడానికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడితో ఆటలాడుకుంటున్న చంద్రబాబుని నిలదీయాలి. చేసిన తప్పుకి పశ్చాత్తాపం ప్రకటించకుండా అబద్దాలు, మోసాలతో మభ్య పెట్టాలని చూస్తున్న కూటమి నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి.
ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ , జిల్లా మహిళా అధ్యక్షురాలు పెడాడ రమణి కుమారి పాల్గొన్నారు
