Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradesh6 రోజులుగా పెద్దపులి బీభత్సం..

6 రోజులుగా పెద్దపులి బీభత్సం..

ప్రచారాలే తప్ప పట్టింపు లేని చర్యలా?
గత ఆరు రోజులుగా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాల పరిధిలో ప్రజల్ని పెద్దపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పులి సంచారం నేపథ్యంలో గ్రామాలన్నీ భయాందోళనలో ఉంటే, అటవీ శాఖ చర్యలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 1న రాజానగరం నియోజకవర్గంలోని తొర్రెడులో ప్రవేశించిన పెద్దపులి అక్కడ మూడు ఆవులను పొట్టనపెట్టుకుంది. ఆ తర్వాత గాడాలా, కొలమూరు ప్రాంతాల్లో సంచరిస్తూ ఈ నెల 3న రాజమండ్రికి అతి చేరువలోని దివాన్ చెరువు వద్ద ప్రత్యక్షమైంది. అంతటితో ఆగకుండా విశాఖ–విజయవాడ జాతీయ రహదారిని దాటి శాటిలైట్ సిటీ సమీపంలోని అక్కమ కొండపై తిష్ట వేసింది.
తాజాగా రఘునాధపురంలో పులి పంజాకు మరో మూడు పశువులు బలి కావడం ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో అధికారులు అలర్ట్ అయ్యామని చెబుతున్నప్పటికీ, నేటికీ పులిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. పులి జాడ తెలుసుకుంటున్నామని ప్రకటిస్తున్నారే తప్ప, దాన్ని భంధించే విషయంలో స్పష్టమైన ఫలితం కనిపించడం లేదన్నది ప్రజల ఆవేదన.
ఈ నిర్లక్ష్యంపై ప్రతిపక్ష వైసీపీతో పాటు గ్రామ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. “ఆరు రోజులుగా పులి సంచరిస్తుంటే ఇప్పటికీ పట్టుకోలేకపోవడమా? ఇది పాలనా వైఫల్యం కాదా?” అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా పెద్దపులి మండపేట పరిసరాల్లో సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించినా, ప్రజల భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనుషులపై దాడి జరగలేదని, భయపడొద్దని అధికారులు చెబుతున్నప్పటికీ… “పశువులే బలి అవుతున్నప్పుడు, మనుషుల ప్రాణాలకు హామీ ఎవరు ఇస్తారు?” అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
ప్రాణనష్టం జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎవరిది?
ప్రజల ప్రాణాలకంటే ప్రచారాలే ముఖ్యమా?
అనే ప్రశ్నలు ఇప్పుడు రాజమహేంద్రవరం పరిసరాల్లో మార్మోగుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments