Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshరాజు గారి మాటలకు అర్ధాలే వేరులే...!

రాజు గారి మాటలకు అర్ధాలే వేరులే…!

కూటమిలో ఉంటూనే కిరికిరి, ఏదో రీతిన వార్తల్లో నిత్యకృత్యం విశాఖలో ఓ రాజుగారి మాటలు భలే గమ్మత్తుగా ఉంటుంటాయి. కూటమిలోనే ఉంటూ…ఎవరికీ అర్ధం కాని…కొత్త విషయాలను వల్లె వేస్తుంటారు. ఆయన మాటలు వింటుంటే…తమ పార్టీని పొగుడుతున్నారా..తిడుతున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఆ పార్టీ నేతల్లోనే ఉంటుంది. కొన్ని విషయాలైతే ముక్కు సూటిగానే ఉంటుంటాయి. ఆయనే బీజేపీ శాసన సభా పక్ష నేత పెన్మెత్స విష్ణుకుమార్ రాజు. ఇప్పుడు ఆయన మాటలు కూటమిలో హాట్‌హాట్‌గా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాకరేపుతున్నాయి. కూటమి అంతా ఒక్క మాటపై ఉండాలని…వైసీపీ నేతలపై ఒంటి కాలిపై లేవాలని భావిస్తుంటే అందుకు భిన్నంగా విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలుండడంతో ఏం చేయాలో తెలియని ఆయోమయ పరిస్థితి టీడీపీ నేతల వంతయ్యింది. తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ దాడి చేయడం సరైన విధానం కాదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అయితే ఈ మాటలు కూటమి నేతలైన టీడీపీ వారికి అస్సలు రుచించడం లేదు. సీఎం చంద్రబాబుపై ఇటీవల అంబటి నోరు జారారు. ఆ వెంటనే నాలుక్కరుచుకుని ఏదో ఫ్లోలో అనేశాను…పైగా ఆ మాటలు చంద్రబాబును ఉద్దేశించినవి కాదని వివరణ ఇచ్చారు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంబటి ఇంటిపై టీడీపీ నేతలు దాడి…ఆ తర్వాత పోలీసు కేసు…అరెస్టు…జైలు శిక్ష వంటి సంగతి తెలిసిందే. మరో పక్క దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వ్యక్తి ఇంటి మీదకు వెళ్లి దాడులకు తెగబడడం సరైన పద్దతి కాదన్నారు. దీంతో విశాఖలోని టీడీపీ నేతలు కక్కలేక మింగలేక కన్నులొట్టబోయి అధిష్టానం వైపు చూస్తున్నారు. అయితే అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు దిక్కులు చూస్తున్నారు. గతంలో కూడా కూటమికి వ్యతిరేకంగా పలు అంశాలను ప్రస్తావించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రుషికొండ భవనాలను ఏం చేయాలో అనే దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని…ఎక్కడో నిర్ణయం తీసుకుంటే కుదరదని..స్థానిక శాసన సభ్యులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అప్పట్లో తెగేసి చెప్పారు. అప్పుడు కూడా ఏంటీ ఈయన ఇలా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలంతా నోటిపై వేలేసుకున్నారు. కూటమి నేతలెవరూ అంత ధైర్యంగా తమ మనోభావాలను చెప్పే ధైర్య సాహసాలు చేయరు. కానీ విష్ణుకుమార్ రాజు మాత్రం తను అనుకున్నదేదో స్పష్టంగా చెప్పగల దమ్మున్న నేతగా విశాఖ వాసులు అనుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments