మంగళవారం తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైన నితిన్ నబీన్‌కు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘం నుంచి నేటి వరకు పార్టీకి నాయకత్వం వహించిన జాతీయ అధ్యక్షుల మధ్య ఎటువంటి కుటుంబ సంబంధాలు లేవని, వారసత్వ రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసేవారికే నాయకత్వ అవకాశాలు లభిస్తాయని, దేశ అభివృద్ధి, భారత్ విశ్వగురువుగా ఎదగాలనే సంకల్పంతో పనిచేసే వారిని పార్టీ ముందుకు తీసుకువస్తుందని తెలిపారు. నితిన్ నబీన్ నియామకం దీనికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో బీజేపీని శక్తివంతంగా నిర్మించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తాడని పిక్కి నాగేంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మలు దత్తు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మూడో, నాలుగో తరం నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా బీజేపీ ముందడుగు వేసిందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సుమారు వందమంది నూతన నాయకులను గుర్తించి, వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీని సభ్యత్వం, నిర్మాణం పరంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. నితిన్ నబీన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ పార్టీని అధికార దిశగా తీసుకెళ్లేందుకు అందరం సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు భూముల దత్తు, రేలంగి శ్రీదేవి, ఎనుముల రంగబాబు, పొన్నాల లక్ష్మీ సంతోషి, కాలేపు సాయి, కురగంటి సతీష్, వీరాంజనేయులు, మరుకుత్తి కుమార్ యాదవ్, తగరం సురేష్ బాబు, ఈశ్వర్, బండి సత్యప్రసాద్, నిల్లా ప్రసాద్, నాగదేవి మీనాక్షి రెడ్డి, కొల్లాపూర్ శీను, బీవీ రామారావు, నందివాడ సత్యనారాయణ, తనుబుద్ధి భాస్కర్, కృష్ణమోహన్, వెంకట్, తంగేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
