19 బీర్లు సేవించిన యువకులు విషాదాంతం పీలేరు నియోజకర్గంలో గుండెలు పిండే విషాదం పీలేరు నియోజకవర్గంలో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం బండవడ్డీపల్లి గ్రామంలో బీర్ల పోటీల పేరుతో అతిగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు మృతిచెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతిచెందిన ఇద్దరు యువకులు.. ఒక్కొక్కరు 19 బీర్లు తాగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండవడ్డీపల్లికి చెందిన ఆరుగురు యువకులు.. బీర్లు తాగేందుకు పోటీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో వారు ఏకంగా 19 బీర్లు తాగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో పరిమితికి మించి బీర్లు తాగడంతో ప్రాణపాయ స్థితికి చేరుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.బీర్లు తాగుతున్న సమయంలో యువకుల్లో ఒకడైన మణికుమార్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సహచరులు అతడిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే మణికుమార్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మరో యువకుడు పుష్పరాజ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ పుష్పరాజ్ కూడా మృతి చెందాడు. ఒకే ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది. విషాద ఛాయలు..బండవడ్డీపల్లి గ్రామంలో ఈ ఘటనతో శోకసంద్రం అలుముకుంది. మృతిచెందిన యువకుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామస్థులు ఈ ఘటనను తలచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేవీపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
