హైడ్రో ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ గా రాయల సుందర్రావు
దుగ్గేరు పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకి జేఏసీ ఏర్పాటు
వందలాదిమంది గిరిజనులతో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక బహిరంగ సభ
మక్కువ, జయజయహే :-
పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం దుగ్గేరు గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న పంపుడ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ (పి.ఎస్.పి) ని వ్యతిరేకిస్తూ శనివారం నాడు దుగ్గేరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు దుగ్గేరు చుట్టుపక్కల గిరిజన గ్రామాలైన మూల వలస, మెండంగి , కొంజుపాక, యర్ర సామంతవలస, యర్ర మట్టి వలస, ఊటగెడ్డ, బొడ్డు సామంతవలస, కోదు పెద్దవలస, మార్కొండపుట్టి, శీబిల్లి, ఇటుక వలస, బెలగండ తదితర గిరిజన గ్రామాలు నుండి గిరిజన నాయకులతోపాటు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. దుగ్గేరులో నిర్వహించిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన జేఏసీకి కన్వీనర్ గా గిరిజన నాయకులు రాయల సుందర్రావును ఏకగ్రీవంగా నియమించారు. అలాగే కో కన్వీనర్లుగా రైతు కూలీ సంఘం నాయకులు ఊయక ముత్యాలు , పీడికి అసిరి, మర్రి చెంచు లతో 32 మందితో హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. దుగ్గేరు ప్రాంత గిరిజనులకు, రైతులకు, నష్టం కలిగించే దుగ్గేరు పంపుడు హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 84 ను రద్దు చేయాలని, ఈ ప్రాంతంలో సురాపాడు మినీ రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఈ సభ తీర్మానించింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైఅతిథులుగా హీజరైన రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ.. దుగ్గేరు గిరిజన ప్రాంతంలో రెండు వేల మెగావాట్ల పంపుడ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపుగా వేయి నుంచి 1500 ఎకరాల వరకు భూమి అవసరమవుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి అనేక గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందన్నారు. మన ప్రాంతంలోనే కాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా, కురుకుటి ఏరియాలలో కూడా ఇటువంటి పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జనాలు పోరాడుతున్నారు. వారిపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్న వెనక్కి తగ్గకుండా జీవన పోరాటం సాగిస్తున్నారని మనం కూడా అదే స్ఫూర్తితో ఐకమత్యంగా ఉండి పోరాడినప్పుడే మన ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతామన్నారు. పంపుడ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ రాయల సుందర్ రావు మాట్లాడుతూ.. మన ప్రాంతంలో ఈ ప్రాజెక్టు రావడం వలన ఇక్కడ ఉండే గిరిజనులకు, గిరిజనేతర రైతులకు, పర్యావరణానికి చాలా నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తరాలుగా జీవనం సాగిస్తున్న గిరిజనులు భూములతో పాటు గ్రామాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం ఇంతమంది గిరిజనుల జీవనాధారమైన అడవిని భూమిని నాశనం చేయడం ప్రభుత్వాలకు తగదని అన్నారు. ఈ కంపెనీ రావడం వలన ఉద్యోగాలు వస్తాయని భ్రమలు కల్పిస్తున్నారని. ప్రైవేట్ కంపెనీ ద్వారా వచ్చే ఉద్యోగాలు శాశ్వతమైనవి కావని పైగా ఈ కంపెనీ ద్వారా వచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ మాత్రమే ఉంటాయని చూచించారు. గిరిజనుల ఆవాసాలను, భూములను, ప్రకృతి వనరులను కొన్ని కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం అమ్మేస్తున్న ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని, దుగ్గేరు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ రాకుండా అందరం ఒకటై పోరాడాలని పిలుపునిచ్చారు.
