మాడుగుల మండల కేంద్రంలో గ్యాస్ ఆఫీసు వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో గ్యాస్ ఉంచాలని ఎప్పటికప్పుడు లైన్లు కట్టకుండా వెంట వెంటనే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిరసన తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి గ్యాస్ సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్‌కు రూ.60, వాణిజ్య సిలిండర్‌కు రూ.115 కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై బారాలు మోస్తున్నారన్నారు. దీంతో పాటు ప్రజలకి గ్యాస్ అందడం లేదు ఉదయం నాలుగు గంటలకు వచ్చి రాత్రి అయినా లైన్లు కట్టి ఉన్నా సరే గ్యాస్ అందడం లేదనీ, టోకెన్ సరఫరా చేసి తిరిగి పంపించవలసి వస్తుందన్నారు. గిరిజన ప్రాంతంలో బుకింగ్ సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులకు అవగాహన లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.మూడు నెలల పైగా గ్యాస్ రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంటగ్యాస్ ధర పెంపు పెద్ద దెబ్బ. అలాగే ఉపాధి కోసం తోపుడు బళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో పొట్ట గడుపుకుంటున్న చిరు వ్యాపారులను వాణిజ్య సిలిండర్ ధర పెంపు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతేకాక అసంఘటిత కార్మికులు స్వల్ప ఆదాయాలు కలిగిన వారు టిఫిన్, కర్రీ తదితర ఆహార ధరలు కూడా పెరుగుతాయనీ, అన్ని విధాల ప్రజా జీవితాన్ని ఘోరంగా నష్టపరిచే గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
