Sunday, April 26, 2026
HomeNewsఅభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్

అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
మొదటగా నిడదవోలు రూరల్ మండలం పెండ్యాల గ్రామంలోని గౌడ రామాలయంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు మంత్రి దుర్గేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పెండ్యాల గ్రామంలో రూ.25 లక్షలతో ఎంపీ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన చిన్న పుంత రోడ్డును మంత్రి పరిశీలించారు. డబ్ల్యూబీఎం పద్ధతిలో నిర్మించిన ఈ రోడ్డుపై పనుల నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ, మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్డు పనులు పూర్తి కావడంతో స్థానిక రైతులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్లే దారి సౌకర్యవంతంగా మారడంతో రవాణా సమస్యలు తొలగిపోయాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
పర్యటనలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. అలాగే కొన్ని శుభకార్యాలకు హాజరయ్యారు.
తరువాత జనసైనికుల ఆహ్వానం మేరకు మునిపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి, గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధి కూడా మన లక్ష్యం. దేవాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలను గౌరవిస్తూ, రైతులకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.
ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు, జనసైనికులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments