ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.4 లక్షల పశువుల స్వాధీనం
కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని చాగల్లు గ్రామంలో జరిగిన పశు దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత రైతులకు చెందిన పశువులను స్వాధీనం చేసుకుని వారికి ఉపశమనం కలిగించారు.
చాగల్లు గ్రామానికి చెందిన రైతులు ఈడుపుగంటి రామకోటేశ్వరరావు, గూడూరి నరసింహారావుకు చెందిన నాలుగు ఆడ గేదెలు, ఒక మగ దూడను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై కే. నరేంద్ర, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు.
కొవ్వూరు డీఎస్పీ దేవ కుమార్, రూరల్ సీఐ కే. విజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి ప్రసాద్, ఎర్రంశెట్టి నాగప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దొంగిలించిన గేదెలను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా, నందమూరు గ్రామంలో జరిగిన మరో దొంగతనానికి సంబంధించిన రెండు గేదెలు, మూడు ఆవులను కూడా ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న పశువుల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పోలీసుల చురుకైన చర్యలతో కేసు త్వరితగతిన ఛేదించబడటంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు.
పశు దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు
RELATED ARTICLES
