Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshసింహాచలేశుని కళ్యాణోత్సవానికి అంకురార్పణ

సింహాచలేశుని కళ్యాణోత్సవానికి అంకురార్పణ

చందనోత్సవంలో సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం
` 24న ఇద్దరు మంత్రులతో చందనోత్సవంపై సమీక్ష
` ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా చందనోత్సవం ఏర్పాట్లు చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రణాళిక బద్ధంగా ఉత్సవాన్ని జరిపించాలన్నారు. ఈనెల 29న జరగనున్న సింహాచలేశుని కళ్యాణోత్సవానికి అంకురార్పణగా ఆలయం, రాజగోపురం, కళ్యాణ వేదికల వద్ద గురువారం నిర్వహించిన పెళ్లి రాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ చందనోత్సవం ఏర్పాట్లపై ఇంచార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈనెల 24 న సమీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. భక్తుల క్యూ లైన్లు, ప్రసాదాలు, పార్కింగ్, మంచినీరు, ఆహారం, రవాణా, పోలీసింగ్ తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది సాధారణ భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూస్తామని వెల్లడించారు. అలాగే కళ్యాణోత్సవం ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలని ఈఓ జె. వెంకట్రావుకు తెలిపారు. కళ్యాణం, చందనోత్సవాలకు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లను ఎమ్మెల్యే గంటాకు ఈఓ వివరించారు. ఏఈఓ తిరుమలేశ్వరరావు, టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, పీవీ నరసింహం, పంచదార్ల శ్రీనివాస్, ముగ్గు కిరణ్, గరే గుర్నాథ్, గోపాల్, సీర కృష్ణ, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఈఈలు రమణ, రాంబాబు, భీమిలి జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments