Home Uncategorized తుఫాన్ అప్రమత్తతపై 6 కోట్ల మెసేజ్ లు

తుఫాన్ అప్రమత్తతపై 6 కోట్ల మెసేజ్ లు

0
  • తుఫాన్ అప్రమత్తతపై 6 కోట్ల మెసేజ్ లు
  • అమరావతి వాతావరణ కేంద్రం నుంచి జారీ
  • అక్టోబర్ లో అత్యధిక వర్షపాతం
  • 2001 తర్వాత ఇదే తొలిసారి

 

దేశంలో ఈ సంవత్సరం ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ నైరుతి స్థాయిలో వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్లు, వాయుగుండాల ప్రభావం కారణంగా అక్టోబర్‌లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అక్టోబర్‌లో సగటున 112.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదవ్వడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అదే విధంగా 1901 తర్వాత ఇది 16వ సారి.

ఇక ఈశాన్య రుతుపవన ప్రాంతం (కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, దక్షిణ అంతర్గత మాహె, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ సబ్‌ డివిజన్లు)లో అయితే అక్టోబర్‌లో సగటున 245.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. 2019లో అత్యధికంగా 250.9 మిల్లిమీటర్ల నమోదు కాగా, తర్వాత ఈసారే అత్యధికం. 2001 తర్వాత ఇది మూడో గరిష్ఠం. దేశ వ్యాప్తంగా గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి అక్టోబర్‌లో 236 ప్రాంతాల్లో అతి భారీ (115.6 మి.మీ-204.5 మి.మీ.), 45 చోట్ల అత్యంత భారీ (204.5 మి.మీ.కు మించి) వర్షాలు కురిశాయి.

రాష్ట్రంలో సాధారణం కంటే 79% ఎక్కువ: రాష్ట్రంలో అక్టోబరులో సాధారణ సగటు వర్షపాతం 161.5 మిల్లిమీటర్ల కాగా, మొంథా తుపాను, వాయుగుండం ప్రభావంతో 288.3 మిల్లిమీటర్లగా నమోదైంది. ఇది సాధారణం కంటే 79% ఎక్కువ అని ఐఎండీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

19 జిల్లాల్లో సాధారణం కంటే 40% ఎక్కువ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో 140%, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు-131%, విజయనగరం-124%, పల్నాడు-119%, గుంటూరు జిల్లాలో 109% అధికంగా నమోదైంది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురవగా, తూర్పుగోదావరి జిల్లాలో లోటు కనిపించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం అక్టోబరులో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో సాధారణానికి మించి వానలు కురిశాయి. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదు.

నవంబరులోనూ ఏపీలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వచ్చే నెలలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం లేదా అంతకుమించి వర్షపాతం నమోదు కావొచ్చు అని పేర్కొంది. అదే విధంగా కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని తెలిపింది.

మొంథా’ తీవ్ర తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, ఇతర కార్యాలయాల ద్వారా మొత్తం ఆరు కోట్ల సందేశాలు వెళ్లాయి.

దీనిపై 55 జాతీయ బులెటిన్లు విడుదల చేసినట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర్‌ తెలియజేశారు. ‘ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో రెండు, అరేబియా సముద్రంలో రెండు వాయుగుండాలు ఏర్పడగా వాటిలో ఒకటి తీవ్ర తుపానుగా, మరోటి తుపానుగా బలపడ్డాయి. మొంథా తీవ్ర తుపాన్‌ గమనం అంచనాలకు భిన్నంగా ఉంది. వీటి ట్రాకింగ్‌పై మరింత అధ్యయనం అవసరం’ అని మహాపాత్ర్‌ వివరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version