Home Politics Andhra Pradesh గూగుల్ డేటా హబ్ పై పిల్

గూగుల్ డేటా హబ్ పై పిల్

0

హైకోర్టులో దాఖలు చేసిన వైసీపీ ఎంపీ

తక్కువ ధరకే భూ కేటాయింపని ఆభియోగం

రాజకీయ కుట్రగా పేర్కొన్న మంత్రి నారా లోకేశ్

విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ భూ కేటాయింపులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమిని కేటాయించడంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయన కోర్టును ఆశ్రయించగా, ఇది రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడమేనని ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిల్ లోని ప్రధానాంశం.. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపించడం. విశాఖలోని విలువైన భూములను తక్కువ ధరకు లేదా నిబంధనలకు విరుద్ధంగా గూగుల్ సంస్థకు కట్టబెట్టారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ భూ కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తూ, ఆ కేటాయింపులను నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. అభివృద్ధి నిరోధక జగన్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. గతంలో అమరావతిని వ్యతిరేకించడం, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం వంటి చర్యలతో రాష్ట్రానికి అన్యాయం చేశారని, ఇప్పుడు విశాఖ యువతకు ఉపాధి కల్పించే గూగుల్ ఏఐ హబ్‌పై కూడా కోర్టుకు వెళ్లడం జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ విమర్శించారు. ఏపీ యువత అంటే వైసీపీకి ఎందుకంత పగ అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి భారీ ప్రాజెక్టు వల్ల వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, విశాఖ ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా మారుతుందని కూటమి నేతలు వాదిస్తున్నారు. ఈ తరుణంలో ప్రతిపక్ష ఎంపీ కోర్టుకు వెళ్లడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడమే వైసీపీ లక్ష్యమని మంత్రి తన పోస్ట్‌లో ఆరోపించారు. వైసీపీ తరఫున ఎంపీ గురుమూర్తి వేసిన ఈ పిటిషన్ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. గత ఐదేళ్ల పాలనలో కూడా పెట్టుబడుల విషయంలో ఇరు పార్టీల మధ్య అనేక వాదోపవాదాలు జరిగాయి. ఇప్పుడు గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థకు సంబంధించిన భూ కేటాయింపులపై న్యాయపోరాటం మొదలవ్వడంతో, ఈ వివాదం మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందోనని అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు నిరుద్యోగ యువతలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version