చేయాల్సిన పని చేయలేదు
నిందితులు చెప్పింది వినడమే పనా
ఫోన్ సంభాషణను సీరియస్ గా తీసుకోలేదు
మీడియాతో వైఎస్ వివేకా కుమార్తె సునీత వ్యాఖ్యలు
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరును ఆయన కుమార్తె సునీత మరోసారి తప్పుపట్టారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేయాల్సిన పనిని చేయల్లేదని ఆరోపించారు. తాను ప్రస్తావించిన అంశాలపై సీబీఐ దర్యాప్తును ఎందుకు మధ్యలో ఆపేసిందో అర్థంకావడం లేదన్నారు. సీబీఐపై ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి వర్దంతి సందర్భాంగా పులివెందులలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత సునీత మీడియా సమావేశం నిర్వహించారు. తన తండ్రి హత్య కేసులో కీలక నిందితులు చెప్పింది వినడమే తప్ప సీబీఐ లోతుగా విచారణ చేపట్టలేదని ఆరోపించారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. హత్య జరగడానికి ముందు, తర్వాత కిరణ్ యాదవ్ అనేక మందితో ఫోన్‌లో మాట్లాడారని సాక్షి టీవీలో గుండెపోటుతో వివేకా మృతి అని రావడానికి ఒక నిమిషం ముందే కిరణ్ యాదవ్, అర్జున్‌రెడ్డికి మెసేజ్ పంపాడని వివరించారు. కిరణ్ యాదవ్ చెప్పిన స్టేట్‌మెంట్ రాసుకున్నారు తప్ప సీబీఐ లోతుగా విచారణ జరపలేదన్నారు. ఎవరిని కాపాడటానికో ఇలా చేస్తున్నారో, తెలియడం లేదన్నారు. 3 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని, అయినా పోరాటం ఆగదని సునీత చెప్పారు. “కిరణ్ యాదవ్ కేవలం ఒక్క మనిషికే ఎందుకు మెసేజ్ పంపాడు? తామంతా బంధువులం అంటున్నారు. దాని పైనా దర్యాప్తు చేయాలి కదా. బంధువులైతే అప్పటికప్పుడే కాంటాక్టులు ఉంటాయా? తప్పు చేసిన వారిని తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. నిజాలు బయటకు వస్తాయి. హత్య గురించి బంధువులకు త్వరగా తెలుస్తుందని సీబీఐ అంది. దర్యాప్తు సంస్థలపై నమ్మకం కోల్పోయేలా వ్యవహరించకూడదు.”అని వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. “నా తండ్రి హత్య కేసులో అందరూ మాకు అన్యాయం చేస్తున్నారు. కీలక నిందితుల విషయంలో చెప్పింది వినడమే తప్ప సీబీఐ లోతుగా విచారణ చేపట్టలేదు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను సీరియస్‌గా తీసుకోలేదు. హత్య జరగడానికి ముందు, తర్వాత కిరణ్ యాదవ్ అనేక మందితో ఫోన్‌లో మాట్లాడారు. సాక్షిలో గుండెపోటుతో వివేకా మృతి అని రావడానికి ఒక నిమిషం ముందే కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డికి మెసేజ్ పంపాడు. కిరణ్ యాదవ్ చెప్పిన స్టేట్‌మెంట్ రాసుకుని వచ్చారు తప్ప సీబీఐ లోతుగా విచారణ జరపలేదు. హత్య తర్వాత నిందితులు అందరి మధ్య ఫోన్‌లో సంభాషణలు, మేసేజ్‌లు అత్యధికంగా జరిగాయి. ఇతర ఆధారాలు ఇవ్వాలని కోరితే నా దగ్గర ఉన్న అదనపు ఆధారాలను కోర్టుతో పాటు సీబీఐకి కూడా సమర్పించాను. వాటి పైనా సీబీఐ లోతుగా విచారించలేదు. ఈ కేసులో మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతిని విచారించాల్సిన అవసరం ఉంది. కానీ సీబీఐ వారిని విచారించలేదు. నేను ఈ స్థాయిలో పోరాడుతున్నా నాకు న్యాయం జరగలేదు. నా పోరాటం ఆగదు. చివరి వరకు కొనసాగిస్తా” అని సునీత అన్నారు.
