కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే పార్టీ రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవహరిస్తే సహించేది లేదని రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టి.కె. విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌లు ఘాటుగా హెచ్చరించారు. ఆదివారం మున్సిపల్ కాలనీలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సిటీ కోఆర్డినేటర్ వంటి కీలక పదవులను నియమించే అధికారం కేవలం పిసిసికే ఉంటుందని, జిల్లా అధ్యక్షుడు బోడా వెంకట్ చేసిన నియామకాలు పూర్తిగా అక్రమమని స్పష్టం చేశారు.
సిటీ అధ్యక్షుడు లేకుండా సమావేశాలు నిర్వహించడం పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడిచే చర్యగా అభివర్ణించారు. నగరంలో జరిగే ప్రతి సమావేశానికి సిటీ అధ్యక్షుడే అధ్యక్షత వహించాలన్న పార్టీ నిబంధనలను ఉల్లంఘించడం సరికాదన్నారు. క్రమశిక్షణ కమిటీలో ఉన్న అరిగెల అరుణకుమారి విభేదాలు సృష్టించే సమావేశానికి హాజరుకావడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
పార్టీ బలోపేతం కావాల్సిన సమయంలో వర్గ రాజకీయాలు ప్రోత్సహించడం కాంగ్రెస్‌కు తీరని నష్టం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథక పరిరక్షణకు షర్మిల చేపట్టనున్న యాత్ర మార్చిలో జిల్లాకు రానుందని, దాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మోతా శారదా, పార్టీ నాయకులు తడాల కొండలరావు, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం, బత్తిన చంద్రరావు, ఎస్తేరు రాణి, షేక్ లలిత, సింధియా రాణి, కె.వి. ఆనంద్‌కుమారి, కె. శారాగ్రేస్, రత్నం వెంకట్రావు, జాలా నటరాజ్, సాకా పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
