Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshకాపులను కరివేపాకు లా వాడుకుని వదిలేస్తున్నారు

కాపులను కరివేపాకు లా వాడుకుని వదిలేస్తున్నారు

అమరావతిలో 500 ఎకరాలు కేటాయించాలి –
కాపు నేత వడ్డి మల్లికార్జున ప్రసాద్
రాజమహేంద్రవరం, (జయ జయహే ప్రతినిధి):
రాజకీయ పార్టీలు కాపులను కరివేపాకు లా వాడుకుని అవసరం తీరగానే పక్కన పెడుతున్నాయని ప్రముఖ కాపు నేత వడ్డి మల్లికార్జున్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిలో కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం 500 ఎకరాల స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మార్చి 8న రాజమహేంద్రవరంలో జరగనున్న కాపుల ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏవీ అప్పారావు రోడ్డులోని అర్బన్ కేఫ్‌లో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నారని చెప్పారు.
గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాజధాని పేరుతో అమరావతిని అన్ని విధాలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాపులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని విమర్శించారు.
రాజధానిలో పలువురికి వేలాది ఎకరాలు కేటాయిస్తున్న ప్రభుత్వం, కాపుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కనీసం 500 ఎకరాలు కేటాయించాలని ఈ సమావేశంలో ప్రధానంగా తీర్మానించనున్నట్టు తెలిపారు. కాపు జేఏసీ ఏర్పాటు, రిజర్వేషన్ల సాధన, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.
దేశిరెడ్డి బలరామ నాయుడు మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు కల్పించి బీసీల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలు కాపులను ఓటు బ్యాంక్‌గా మాత్రమే ఉపయోగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను మాట్లాడుతూ వడ్డి మల్లికార్జున్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే తరానికైనా రిజర్వేషన్లు అమలు చేస్తేనే కాపుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments