ప్రపంచ సాంకేతిక విజ్ఞాన రంగంలో కంప్యూటర్ల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే సెకనుకు కోట్లాది గణనలను నిర్వహించే సూపర్ కంప్యూటర్లు ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు అతిపెద్ద సూపర్ కంప్యూటర్ గా అమెరికాకు చెందిన ‘ఫ్రాంటియర్’ రికార్డు సృష్టించింది. టేనస్సీ రాష్ట్రంలోని ఓక్ రిడ్జ్ నేషనల్ లాబొరేటరీలో ఈ మహా యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎక్సాస్కేల్ సామర్థ్యాన్ని సాధించిన మొదటి కంప్యూటర్ గా చరిత్రలో నిలిచిపోయింది. దీని వేగం మరియు పనితీరు మానవ మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనమని చెప్పవచ్చు. శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మరియు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ కంప్యూటర్ ను రూపొందించారు.
ఫ్రాంటియర్ సూపర్ కంప్యూటర్ యొక్క విశిష్టతలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇది సెకనుకు క్వింటిలియన్ కంటే ఎక్కువ గణనలను చేయగలదు. దీని పనితీరును ‘ఎక్సాఫ్లాప్స్’లో కొలుస్తారు. ఫ్రాంటియర్ సుమారు 1.194 ఎక్సాఫ్లాప్స్ వేగాన్ని కలిగి ఉంది. అంటే సాధారణంగా మనం వాడే లక్షలాది ల్యాప్‌టాప్‌లు కలిసి చేసే పనిని ఇది ఒక్కటే క్షణాల్లో పూర్తి చేస్తుంది. దీనిని నిర్మించడానికి హెచ్.పి.ఈ క్రే కంపెనీ యొక్క అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఇందులో ఏ.ఎమ్.డి కంపెనీకి చెందిన వేలాది ప్రాసెసర్లు మరియు గ్రాఫిక్ కార్డులను అమర్చారు. ఈ విడిభాగాలన్నీ కలిసి అత్యంత వేగంగా డేటాను విశ్లేషిస్తాయి. ఈ కంప్యూటర్ పరిమాణం కూడా చాలా పెద్దది. ఇది సుమారు రెండు బాస్కెట్‌బాల్ కోర్టులంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇందులోని కేబుళ్ల పొడవు కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఇంతటి భారీ యంత్రాన్ని నడపడానికి మరియు చల్లబరచడానికి భారీ స్థాయిలో విద్యుత్ మరియు నీరు అవసరమవుతాయి. ఫ్రాంటియర్ పని చేసేటప్పుడు విపరీతమైన వేడి ఉత్పన్నమవుతుంది. దానిని నియంత్రించడానికి ప్రతి నిమిషానికి వేలాది లీటర్ల చల్లని నీటిని పంపింగ్ చేసే కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కంప్యూటర్ వినియోగించే విద్యుత్ ఒక చిన్న నగరం యొక్క విద్యుత్ అవసరాలకు సమానంగా ఉంటుంది. అయినప్పటికీ దీనిని ‘గ్రీన్ 500’ జాబితాలో అత్యంత సమర్థవంతమైన కంప్యూటర్లలో ఒకటిగా గుర్తించారు. అంటే తక్కువ విద్యుత్ తో ఎక్కువ పని చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ యంత్రం ద్వారా వాతావరణ మార్పులను అంచనా వేయడం, కొత్త రకమైన మందులను కనిపెట్టడం మరియు విశ్వం పుట్టుకకు సంబంధించిన రహస్యాలను ఛేదించడం వంటి పరిశోధనలు చేస్తున్నారు.
అమెరికా తర్వాత చైనా మరియు జపాన్ దేశాలు కూడా శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లను కలిగి ఉన్నాయి. జపాన్ కు చెందిన ‘ఫుగాకు’ మరియు చైనాకు చెందిన ‘సన్‌వే తైహు లైట్’ వంటివి కూడా ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తాయి. భారతదేశం కూడా ‘ఐరావత్’ మరియు ‘పరమ్ సిద్ధి’ వంటి సూపర్ కంప్యూటర్లతో ఈ రంగంలో తన ముద్ర వేస్తోంది. అయితే ఫ్రాంటియర్ సాధించిన వేగం మరియు ఖచ్చితత్వం ప్రస్తుతం ఏ ఇతర కంప్యూటర్ కు లేదు. ఇది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు కృత్రిమ మేధస్సు మరియు డేటా విశ్లేషణ రంగంలో ఒక విప్లవం. భవిష్యత్తులో రోదసీ యాత్రలకు మరియు అణుశక్తి పరిశోధనలకు ఫ్రాంటియర్ అందించే సమాచారం ఎంతో విలువైనది. సాంకేతికత మారుతున్న కొద్దీ ఇంకా వేగవంతమైన కంప్యూటర్లు రావచ్చు కానీ ప్రస్తుతం ఫ్రాంటియర్ మాత్రమే ప్రపంచ కంప్యూటర్ సామ్రాజ్యానికి రారాజుగా నిలుస్తోంది.
(సి.హెచ్.ప్రతాప్)
