Home Editorials ముసుగు* (The Mask)

ముసుగు* (The Mask)

0

*ముసుగు* (The Mask)
(క్రైమ్ స్టోరీ)
(మొదటి భాగం)
రచన: *తిరుమలరావు పామరాజు*
భద్రాచలం
సెల్ నెం: 9573547496
చీకటి నీడలు…
మూరాల వెంకటేశ్వర్లు గుండె వేగం రైలు ఇంజిన్‌లా కొట్టుకుంటోంది. ఆ పాన్ షాపు నుండి ముందుకు కదిలాడు కానీ, కాళ్ళు తడబడుతున్నాయి. ఆ బ్లాక్ జెర్కిన్ వ్యక్తి ఇంకా అక్కడే నిలబడి సిగరెట్ వెలిగించాడు. ఆ నిప్పు రవ్వల వెలుగులో అతని ముఖం సగం కనిపించి, సగం చీకటిలో కలిసిపోయింది. ఆ చూపుల్లో ఏదో రాక్షసత్వం ఉంది.
వెంకటేశ్వర్లు చటుక్కున పక్కనే ఉన్న ఒక ఇరుకు సందులోకి మలుపు తిరిగాడు. అది మెయిన్ రోడ్డుకి పోయే షార్ట్ కట్. కానీ ఈ రాత్రి వేళ అక్కడ వీధి దీపాలు వెలగడం లేదు. అంతా చీకటిగా ఉంది.
“టక్… టక్… టక్…”
వెనుక బూట్ల చప్పుడు! ఆ ఆగంతకుడు కూడా సందులోకి వచ్చేశాడు. వెంకటేశ్వర్లు ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. కొద్ది సమయం పరిగెత్తాక బాగా ఆయాసం వస్తోంది. ఊపిరి అందడం లేదు. ఆ సందు చివర పాడుబడిన ఒక గోడౌన్ ఉంది. హంతకుడి నుండి తప్పించుకోవడానికి వేరే దారి లేదు. వెంకటేశ్వర్లు ఆ గోడౌన్ వెనుక ఉన్న తుప్పు పట్టిన రేకుల షెడ్డులోకి దూరి, ఒక పాత బీరువా వెనుక దాక్కున్నాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. వెంకటేశ్వర్లు గుండె దడ దడ కొట్టుకుంటుంది.
***
బయట నిశబ్దాన్ని చీలుస్తూ ఆ బూట్ల చప్పుడు గోడౌన్ లోపలికి వచ్చింది.
“మిస్టర్ వెంకటేశ్వర్లూ… బయటికి రా! నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు,” ఆ గంభీరమైన గొంతు ఆ నిశీధిలో గోడౌన్ అంతా ప్రతిధ్వనించింది.
వెంకటేశ్వర్లు ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఆ చీకటిలోనే తడిమితే ఒక ఐరన్ రాడ్ దొరికింది.
చేతికి దొరికిన ఆ ఇనుప రాడ్ ని గట్టిగా పట్టుకున్నాడు. “వీడే ఆ సైకో కిల్లర్… నన్ను చంపేస్తాడు… చంపేస్తాడు…” అని మనసులో అనుకోసాగాడు.
ఆ బ్లాక్ జెర్కిన్ వ్యక్తి నెమ్మదిగా బీరువా వైపు అడుగులు వేశాడు. అతని చేతిలో పెన్ టార్చ్ ఆన్ చేసి ఉంది. వెంకటేశ్వర్లు దాగిన ప్రదేశం అంతా టార్చ్ వెలుగు లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆగంతకుని మరో చేతిలో నల్లటి రివాల్వర్ తళుక్కుమంది. సరిగ్గా బీరువా దగ్గరకు రాగానే, వెంకటేశ్వర్లు ప్రాణభయంతో ఒక్క ఉదుటున లేచి, చేతిలోని రాడ్‌తో ఆ వ్యక్తి చేతి మీద బలంగా కొట్టాడు.
“అమ్మా!” అంటూ ఆ వ్యక్తి రివాల్వర్ కింద పడేసి, చేతిని పట్టుకుని నొప్పితో విలవిల లాడుతూ, మోకాళ్ళ మీద కూలబడ్డాడు. వెంకటేశ్వర్లు వెంటనే కిందపడున్న ఆ రివాల్వర్ తీసుకుని, వణుకుతున్న చేతులతో ఆ వ్యక్తికి గురిపెట్టాడు.
“ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేనేం పాపం చేశాను?” వెంకటేశ్వర్లు గట్టిగా అరిచాడు. అతని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.
ఆ బ్లాక్ జెర్కిన్ వ్యక్తి బాధను దిగమింగుతూ
“నేను నిన్ను చంపడానికి రాలేదు వెంకటేశ్వర్లు… నిన్ను కాపాడటానికి వచ్చాను.” అన్నాడు. “నువ్వు చెప్పింది అబద్దం..నువ్వే వరుసగా హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ వి.. నాకు తెలుసు.. నన్ను ఏమార్చలేవు” అన్నాడు వెంకటేశ్వర్లు.
***
“వెంకటేశ్వర్లు..నీకు ఒక నిజం చెప్పడానికి నిన్ను ఫాలో అవుతున్నాను. నిన్ను కాపాడాలనే ఉద్దేశ్యం ఉంది. నా మాటలు నమ్ము” అన్నాడు. ఆ ఆగంతకుడి మాటలు విని, వెంకటేశ్వర్లు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. “ఏంటి? నన్ను కాపాడటానికా?”
“అవును. నా పేరు ‘శరత్’. నేనొక ప్రైవేట్ డిటెక్టివ్ ని. నీ భార్య భైరవి నన్ను నియమించింది,” అన్నాడు శరత్.
“నా భార్యా? తను చనిపోయి రెండేళ్లు అవుతోంది కదా!” వెంకటేశ్వర్లు అయోమయంగా అడిగాడు.
శరత్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. “అక్కడే నువ్వు పొరబడుతున్నావు వెంకటేశ్వర్లు. నీ భార్య చనిపోలేదు. ఆమె బతికే ఉంది. కానీ నువ్వు తెలుసుకోవల్సింది ఆమె గురించి కాదు… ఈ నగరంలో జరుగుతున్న వరుస హత్యల గురించి.” అని
శరత్ తన కోటు జేబులోంచి కొన్ని ఫోటోలు తీసి వెంకటేశ్వర్లు ముందు విసిరాడు.
ఆ ఫోటోలు చూసిన వెంకటేశ్వర్లు కళ్లు బైర్లు కమ్మాయి. అవన్నీ ఈ మధ్య జరిగిన హత్యల ఫోటోలు. చనిపోయిన వాళ్ళందరూ ఒకే తీరులో చంపబడ్డారు. పదునైన కత్తితో గొంతు కోయబడి హత్య చేయబడ్డారు.
కానీ… ఆ ఫోటోల్లోని ఒక మూల… వెంకటేశ్వర్లు వాడుతున్న తెల్ల టోపీ (Hat), అతను వాడే చేతి రుమాలు, అతని బైక్ కీ చైన్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
“పోలీసులు చేతులెత్తేయలేదు వెంకటేశ్వర్లు. వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు. నువ్వే ఆ సైకో కిల్లర్ వి!. ఇవ్వాళ్ళో రేపో నిన్ను పట్టుకుంటారు.” శరత్ బాంబు పేల్చాడు.
:***
ఆ మాటలు విన్న వెంకటేశ్వర్లు పెద్దగా అరిచాడు.
“నో..! అబద్ధం! నేను అమాయకుడిని…ఈ హత్యలు నేను చేయలేదు. అసలు నాకు రక్తం అంటేనే భయం!” వెంకటేశ్వర్లు గట్టిగా అరిచి తల పట్టుకుని కూర్చుండిపోయాడు. వెంకటేశ్వర్లుకి ఎడతెగని ఆలోచనలతో భరించలేనంతగా హెడేక్ వచ్చింది.. గతం తాలూకు మసక మసక జ్ఞాపకాలు వరుసగా దాడి చేస్తున్నాయి.
రక్తం… కత్తి… అర్ధరాత్రి వేట…బాధాకరమైన ఆర్తనాదం..శవం..
శరత్ గంభీరంగా చెప్పాడు, “నీకు ‘స్ప్లిట్ పర్సనాలిటీ’ (DID – Dissociative Identity Disorder) ఉంది. పగలు నువ్వు పిరికివాడివి అయిన వెంకటేశ్వర్లువి. కానీ రాత్రి అయితే… నీలోని ఆ క్రూరమృగం బయటికి వస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు ఈ హత్యలు చేస్తున్నావు. గత మూడు రోజులుగా నేను నిన్ను ఫాలో అవుతోంది నిన్ను చంపడానికి కాదు, నువ్వు ఇంకో హత్య చేయకుండా ఆపడానికి.”
వెంకటేశ్వర్లు ఏడుపు ఆగిపోయింది. నిశబ్దం ఆవరించింది.
అతను నెమ్మదిగా తల పైకి ఎత్తాడు. అంతవరకు ఉన్న భయం, అమాయకత్వం అతని ముఖంలో ఇప్పుడు లేవు. అతని కళ్ళలో ఒక వింత మెరుపు. పెదాల మీద ఒక క్రూరమైన చిరునవ్వు (Smirk) విరిసింది.
అతను చేతిలోని రివాల్వర్ ని శరత్ గుండెకు గురిపెట్టాడు.
“నువ్వు చెప్పిన కథ చాలా బాగుంది మిస్టర్..” వెంకటేశ్వర్లు గొంతులో ఇప్పుడు వణుకు, తడబాటు లేవు..పూర్తి గాంభీర్యం ఉంది. ” నీ విశ్లేషణ బాగుంది. కానీ చిన్న కరెక్షన్. నువ్వు నన్ను అంచనా వేయడంలో పొరపడ్డావు. నిజానికి నాకు ఎలాంటి మానసిక జబ్బు లేదు. నేను కావాలనే ఇదంతా చేస్తున్నాను. పగలు అమాయకుడిలా నటించడం, రాత్రి మనుషులను వేటాడటం… నాకు అదొక కిక్. మనిషిని చంపుతుంటే అంతులేని థ్రిల్ వస్తుంది. ఈ మూడు రోజులు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని నాకు తెలుసు. నిన్ను ఈ నిర్మానుష్య ప్రదేశానికి ఒంటరిగా రప్పించడానికే నేను భయపడినట్టు నటించాను.”. వెంకటేశ్వర్లు మాటలు వినగానే
శరత్ కళ్ళలో ఇప్పుడు నిజమైన భయం మొదలైంది. “అంటే…”
“సిటీలో అందరూ భయపడుతున్న ఆ సైకో కిల్లర్ నేనే. నా లిస్ట్ లో తర్వాతి పేరు… నీదే!” శరత్ గుండెకి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గురిపెట్టి షూట్ చేసాడు.
ఢాం!..
రివాల్వర్ పేలుడు శబ్దం ఆ గోడౌన్ లో ప్రతిధ్వనించింది. బయట ఆకాశంలో మెరుపు ఒక్కసారిగా మెరిసింది. శరత్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గోడౌన్ ఊరి చివర ఉండటం వలన రివాల్వర్ పేలిన శబ్దం ఎవరూ వినే అవకాశం తక్కువ..
తెల్లవారింది..పోలీసు సైరన్లు దూరం నుండి వినిపిస్తున్నాయి. కానీ అక్కడ ఇప్పుడు మూరాల వెంకటేశ్వర్లు లేడు, శరత్ శవం తప్ప. అక్కడ పడి ఉన్న ఫోటోలను, ఇతర ఆధారాలు తీసుకొని వెంకటేశ్వర్లు ఎప్పటిలాగే తన తెల్ల టోపీ పెట్టుకుని, వణుకుతున్న చేతులతో చీకటిలో కలిసిపోయాడు… తదుపరి “వేట” కోసం…
***
శరత్ హత్య నగరంలో సంచలనం సృష్టించింది. హంతకున్ని పట్టుకోలేని పోలీసులు అంటూ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అప్పటికే మూడు నెలల వ్యవధిలో ఆరు హత్యలు జరిగాయి. చీకటి పడితే చాలు..ప్రజలు ఎవరూ బయటకి రావడం లేదు. ప్రజా జీవనం స్థంభించింది.
హంతకుడిని ఎలా అయినా పట్టుకోవాలని డెడ్ ఆర్ ఎలైవ్ అని హోమ్ మంత్రి క్రైమ్ మీటింగ్ లో డీజీపీ కి గట్టిగా చెప్పాడు.
***
అంజలి తన ఆఫీస్ వర్క్ ముగించుకొని స్కూటీలో ఇంటికి బయలుదేరింది. రెడ్ సిగ్నల్ పడగానే తన స్కూటీ ఆపి రియర్ వ్యూ మిర్రర్ లో చూసి ఉలిక్కిపడింది. వాడే.. తెల్ల టోపీ వ్యక్తి.. గత రెండు రోజులుగా తనని ఫాలో అవుతున్నాడు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యల విషయం గుర్తుకు రాగానే అంజలి భయంతో వణికి పోయింది. అసలే అమ్మ, నాన్నలు ఊళ్ళో లేరు. పెళ్ళికి హైదరాబాద్ వెళ్లారు. రెండు రోజుల వరకు రారు. తానిప్పుడు ఒంటరిగా ఉంది. అశోక్ నగర్ కాలనీలో ఉన్న తన ఇల్లు ఒంటరిగా ఒక మూల విసిరేసినట్లు ఉంది. సమీపంలో ఇళ్ళు లేవు. మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. రెండు నిముషాల తరువాత గ్రీన్ లైట్ వెలగగానే అప్పటివరకు స్థబ్దంగా ఉన్న ట్రాఫిక్ కదిలింది. వెనుక ఉన్న బైకర్ గట్టిగా హారన్ కొట్టడంతో అంజలి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పడి, స్కూటీ మూవ్ చేసింది. 10 నిముషాలలో ఇల్లు చేరుకొని, స్కూటీ పార్క్ చేసి, ఇంటి లాక్ తీసి లోపలకి వెళ్లి తలుపులు వేసి బోల్ట్ పెట్టింది. తలుపు కీ హోల్ నుండి బయటకి చూసింది. బయట ఎవరు లేరు. హమ్మయ్య అనుకొని కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని తాగి, హాల్ లోకి వచ్చి టీవీ ఆన్ చేసింది. న్యూస్ రీడర్ నగరంలో జరుగుతున్న హత్యల గురించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెపుతోంది. ఇంటి ప్రహరీ ఎక్కి, వెనుక ఉన్న గార్డెన్ లో మూరాల వెంకటేశ్వర్లు దూకిన శబ్దం టీవీ సౌండ్ లో కలిసిపోయింది. ఆమెకు తెలియదు.. అదే ఆమె చివరి రాత్రి అని..
(సశేషం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version