Home Devotional దేశంలో అత్యంత పెద్ద దేవాలయం

దేశంలో అత్యంత పెద్ద దేవాలయం

0

భారతదేశంలో అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ రంగనాథస్వామి ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. సుమారు 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. కావేరి అలాగే కొల్లిదం నదుల మధ్య ఉన్న ఒక ద్వీపంలో వెలసిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు అద్భుతమైన నిర్మాణ శైలికి నిలువుటద్దంగా కనిపిస్తుంది. దీనిని భూలోక వైకుంఠంగా భక్తులు ఎంతో భక్తితో కొలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఉన్న 108 దివ్యదేశాలలో ఇది మొట్టమొదటిది. ఆలయ ప్రాంగణం ఏడు ప్రాకారాలతో నిర్మితమై ఉంది. ఇక్కడ మొత్తం 21 అద్భుతమైన గోపురాలు ఉన్నాయి. అన్నిటికంటే ఎత్తైన రాజగోపురం సుమారు 236 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది. ఈ గోపురాన్ని చూడగానే భక్తులకు భక్తిభావం కలుగుతుంది. ఆలయ నిర్మాణం ద్రవిడ శైలిని ప్రతిబింబిస్తూ శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు రంగనాథస్వామి రూపంలో ఆదిశేషునిపై శయనించి ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దివ్య మంగళ స్వరూపం మనోహరంగా ఉండి చూసేవారికి ప్రశాంతతను చేకూరుస్తుంది.

పురాణాల ప్రకారం ఈ మూలవిరాట్టును శ్రీరాముడు స్వయంగా విభీషణుడికి బహుమతిగా ఇచ్చాడు. విభీషణుడు తన లంకకు వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని నేలపై ఉంచడంతో అది ఇక్కడే స్థిరపడిపోయిందని స్థల పురాణం చెబుతోంది. శ్రీ రంగనాథస్వామి ముఖం దక్షిణ దిశ వైపు అంటే విభీషణుడి లంక వైపు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ సముదాయంలో వెయ్యి స్తంభాల మండపం ఒక గొప్ప కట్టడం. ఈ మండపంలోని ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. గుర్రపు రౌతులు దేవతా మూర్తుల విగ్రహాలు ఎంతో నైపుణ్యంతో నిర్మించబడ్డాయి. ఆలయ గోడలపై ఉన్న శాసనాలు చోళ పాండ్య విజయనగర రాజుల కాలం నాటి చరిత్రను వివరిస్తాయి. ఈ రాజులు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధన్వంతరి సన్నిధిలో ప్రాచీన వైద్య విధానాలకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న గరుడ విగ్రహం సుమారు 25 అడుగుల ఎత్తు ఉండి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతి ఏటా నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా సాగుతాయి. ఆ సమయంలో ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకోవడం కోసం లక్షలాది మంది ప్రజలు దేశం నలుమూలల నుండి తరలివస్తారు. ఇరవై ఒకడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి.

శ్రీ రంగనాథస్వామి ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఇక్కడ భద్రపరచబడిన శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. సుమారు తొమ్మిది వందల ఏళ్ల క్రితం సిద్ధాసనంలో కూర్చున్న స్థితిలో ప్రాణత్యాగం చేసిన ఆయన పార్థివ దేహం నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఒక అద్భుతం. ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం కుంకుమపువ్వు పచ్చకర్పూరం వంటి సహజ సిద్ధమైన ద్రవ్యాలతో దీనిని సంరక్షిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఐదు గాలి గోపురాలు అలాగే అనేక చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ప్రాచీన కాలంలోనే నీటి నిర్వహణ వ్యవస్థను ఎంత సమర్థవంతంగా అమలు చేశారో దీనిని చూస్తే అర్థమవుతుంది. ఆలయ సంప్రదాయాలు ఆచారాలు నేటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ముస్లిం దండయాత్రల సమయంలో భక్తులు స్వామి వారి విగ్రహాన్ని రక్షించడానికి చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆ సమయంలో విగ్రహాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి చివరకు తిరిగి ఇక్కడ ప్రతిష్టించారు. ఈ క్షేత్రం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలను కలిగి ఉంది. ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక చింతన కలిగించడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. భారతీయ సంస్కృతి వారసత్వం ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన మహా క్షేత్రం ఇది. భారతదేశపు శిల్పకళా వైభవాన్ని ఆధ్యాత్మిక సంపదను ఈ రంగనాథస్వామి ఆలయం లోకానికి చాటిచెబుతోంది. ఈ క్షేత్ర సందర్శన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మధుర స్మృతిగా మిగిలిపోతుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఈ ఆలయ ప్రాకారాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. తరతరాల నాటి భక్తి భావాన్ని కాపాడుకుంటూ ఈ క్షేత్రం నేటికీ దేదీప్యమానంగా వెలుగుతోంది. భక్తుల పాలిట కల్పవల్లిగా కొలువై ఉన్న రంగనాథుని వైభవం వర్ణనాతీతం.

(సి.హెచ్.ప్రతాప్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version