ప్రపంచ క్రీడా చరిత్రలో ఒలింపిక్ క్రీడలకు అత్యంత విశిష్టమైన మరియు పురాతనమైన స్థానం ఉంది. క్రీస్తు పూర్వం 776వ సంవత్సరంలో ప్రాచీన గ్రీస్ దేశంలోని ఒలింపియా అనే పవిత్ర ప్రదేశంలో మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు గ్రీకు దేవతల రాజు అయిన జ్యూస్ గౌరవార్థం ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి నిర్వహించబడేవి. ప్రాచీన కాలంలో ఈ క్రీడలు కేవలం ఒక క్రీడా పోటీలు మాత్రమే కాకుండా అత్యంత పవిత్రమైన మతపరమైన ఉత్సవాలుగా పరిగణించబడేవి. ఈ క్రీడల ప్రారంభం వెనుక అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవతల వీరుడైన హెరాక్లెస్ లేదా పెలోప్స్ అనే రాజు ఈ క్రీడలను ప్రారంభించారని గ్రీకులు విశ్వసించేవారు. ఈ ఉత్సవాల సమయంలో గ్రీస్ దేశంలోని వివిధ నగర రాజ్యాల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతున్నప్పటికీ వాటిని తాత్కాలికంగా నిలిపివేసేవారు. దీనినే ‘ఒలింపిక్ సంధి’ లేదా ‘ఎకెచెయిరియా’ అని పిలిచేవారు. క్రీడాకారులు మరియు సందర్శకులు సురక్షితంగా ఒలింపియా చేరుకోవడానికి ఈ సంధి దోహదపడేది. శాంతిని సోదరభావాన్ని మరియు ఐక్యతను పెంపొందించడమే ఈ క్రీడల ప్రధాన ఉద్దేశ్యం.
మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలలో కేవలం ఒకే ఒక పోటీ ఉండేది. దానిని ‘స్టాడియన్’ అని పిలిచేవారు. ఇది సుమారు నూట తొంభై రెండు మీటర్ల దూరం ఉండే పరుగు పందం. ఈ చారిత్రాత్మకమైన మొదటి పోటీలో ఎలిస్ నగరానికి చెందిన కోరోయిబస్ అనే ఒక వంటవాడు విజేతగా నిలిచి చరిత్రలో మొట్టమొదటి ఒలింపిక్ విజేతగా రికార్డు సృష్టించాడు. ప్రారంభంలో ఈ క్రీడలు కేవలం ఒక్క రోజు మాత్రమే జరిగేవి. అయితే కాలక్రమేణా క్రీడల ప్రాచుర్యం పెరగడంతో కొత్త క్రీడలను ఇందులో చేర్చారు. ‘డియౌలోస్’ అనబడే రెండు సార్లు స్టేడియం చుట్టూ తిరిగే పరుగు పందెం అలాగే ‘డోలికోస్’ అనే సుదీర్ఘ పరుగు పందెం ప్రవేశపెట్టబడ్డాయి. వీటితో పాటు కుస్తీ పోటీలు బాక్సింగ్ రథాల పోటీలు మరియు ఈటె విసరడం డిస్కస్ త్రో వంటి పోటీలతో కూడిన ‘పెంటాథ్లాన్’ కూడా చేర్చబడింది. దీనితో క్రీడల వ్యవధి ఐదు రోజులకు పెరిగింది. మొదటి రోజు దైవ ప్రార్థనలు మరియు క్రీడాకారుల ప్రతిజ్ఞలతో మొదలయ్యే ఈ ఉత్సవాలు చివరి రోజు విజేతల సన్మానంతో ముగిసేవి. విజేతలకు నేటి కాలంలాగా బంగారు లేదా వెండి పతకాలు ఇచ్చే వారు కాదు. దానికి బదులుగా జ్యూస్ ఆలయం వద్ద ఉన్న పవిత్రమైన ఆలివ్ కొమ్మలతో చేసిన కిరీటాన్ని బహుమతిగా అలంకరించేవారు. ఆ ఆలివ్ కిరీటం ధరించడం అనేది ఆ కాలంలో అత్యున్నత గౌరవంగా మరియు దైవ సమానంగా భావించబడేది.
ప్రాచీన ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే నిబంధనలు ఎంతో కఠినంగా ఉండేవి. కేవలం గ్రీకు పౌరులైన పురుషులు మాత్రమే పాల్గొనేవారు. మహిళలకు ఈ పోటీలలో పాల్గొనడానికి లేదా క్రీడలను వీక్షించడానికి అనుమతి ఉండేది కాదు. క్రీడాకారులు పోటీలకు ఒక నెల ముందే ఎలిస్ నగరానికి చేరుకుని కఠినమైన శిక్షణ పొందాల్సి ఉండేది. వారు తమ శారీరక దృఢత్వాన్ని మరియు అందాన్ని ప్రదర్శించడానికి దుస్తులు లేకుండానే పోటీలలో పాల్గొనేవారు. గ్రీకు సంస్కృతిలో శారీరక సౌందర్యం మరియు మానసిక శక్తికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. క్రీడాకారులు తమ ఒంటికి నూనె రాసుకుని ఇసుకలో సాధన చేసేవారు. కుస్తీ మరియు బాక్సింగ్ కలిపిన ‘పాంక్రాషన్’ అనే క్రీడ అత్యంత సాహసోపేతంగా మరియు ప్రమాదకరంగా ఉండేది. ఈ క్రీడలు దాదాపు వెయ్యి ఏళ్లకు పైగా నిరంతరాయంగా సాగాయి. అయితే రోమన్ సామ్రాజ్యం గ్రీస్‌ను ఆక్రమించిన తర్వాత క్రీడల స్వరూపం మారింది. క్రీస్తు శకం 393వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి థియోడోసియస్ ఈ క్రీడలను అన్యమత ఆచారాలుగా పరిగణించి నిషేధించారు. దీనితో ప్రాచీన ఒలింపిక్ క్రీడల అద్భుత ప్రస్థానానికి తాత్కాలికంగా తెరపడింది.
అనేక శతాబ్దాల విరామం అనంతరం ఆధునిక ఒలింపిక్ క్రీడలు పునరుద్ధరించబడ్డాయి. పియరీ డి కుబెర్టిన్ అనే ఫ్రెంచ్ విద్యావేత్త మరియు క్రీడాభిమాని కృషితో పందొమ్మిదవ శతాబ్దం చివరలో ఒలింపిక్ ఉద్యమం మళ్ళీ ఊపిరి పోసుకుంది. 1894వ సంవత్సరంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పడింది. దీని ఫలితంగా 1896వ సంవత్సరంలో గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రాచీన క్రీడల స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆధునిక క్రీడలను ఇందులో జోడించారు. పద్నాలుగు దేశాల నుండి సుమారు రెండు వందల యాభై మంది క్రీడాకారులు ఈ చారిత్రాత్మక వేడుకలో పాల్గొన్నారు. నాటి నుండి నేటి వరకు ఒలింపిక్ క్రీడలు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ప్రతిష్టాత్మకమైన క్రీడా ఉత్సవంగా విరాజిల్లుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది క్రీడాకారులు తమ దేశ కీర్తిని చాటడానికి ఈ వేదికపై పోటీ పడుతున్నారు.
ప్రాచీన ఒలింపియాలో వెలిగించిన ఆ క్రీడా జ్యోతి నేటికీ ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు మైత్రికి చిహ్నంగా వెలుగుతూనే ఉంది. క్రీడలు మనుషులను ఏకం చేస్తాయని మరియు దేశాల మధ్య వైషమ్యాలను తగ్గిస్తాయని నిరూపించడంలో ఒలింపిక్స్ పాత్ర చిరస్మరణీయం. ఒక చిన్న పరుగు పందెంతో మొదలైన ఈ ప్రయాణం నేడు వందలాది క్రీడలతో వేలాది మంది క్రీడాకారుల కలల వేదికగా మారింది. ప్రతి ఒలింపిక్ పోటీ వెనుక వందల ఏళ్ల చరిత్ర మరియు వేల మంది క్రీడాకారుల శ్రమ దాగి ఉన్నాయి. ఒలింపిక్ క్రీడల చరిత్రను తెలుసుకోవడం ద్వారా క్రీడా స్ఫూర్తి పట్ల మనకు గౌరవం పెరుగుతుంది. ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు మానవ శక్తికి మరియు పట్టుదలకు నిదర్శనం.
(సి.హెచ్.ప్రతాప్)
