Home Politics Andhra Pradesh బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి

బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి

0

బంగారు భవిష్యత్తు సాధించాలంటే విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. స్థానిక విఎల్‌పురంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో “సే నో టూ డ్రగ్స్” అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన జీవనం, క్రమశిక్షణ, చదువుపై దృష్టి పెట్టడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగం, ర్యాగింగ్, రాష్ డ్రైవింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాల్లో ఇరుక్కొని భవిష్యత్తు నాశనం చేసుకున్న సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి కేసుల్లో చిక్కుకుంటే జీవితమే మలుపుతిరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం డ్రగ్స్‌పై తీసుకుంటున్న కఠిన చర్యలు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి తీసుకువస్తున్న పెట్టుబడులపై వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా అంతర్జాతీయంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. వీటి వల్ల యువతకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగుపడతాయని అన్నారు.
ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ త్వరలో ఓటు హక్కు రానుందని, బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. “చదువుకోవడం మీ చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాలను వృథా చేయకండి” అంటూ ఉత్సాహభరితంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశంనగర్ పోలీస్ స్టేషన్ సీఐ బాజీలాల్, ఈగల్ టీమ్ ఎస్సై నరేష్‌కుమార్‌లు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపరాదని, ప్రమాదం జరిగితే వాహనం ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మైనర్ల పాత్రపై అవగాహన కల్పించారు. సిగరెట్లు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సెల్‌ఫోన్‌ను చదువు, కెరీర్ కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ “సే నో టూ డ్రగ్స్” ప్లకార్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version