Home Politics Andhra Pradesh పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్ట చర్యలు

పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్ట చర్యలు

0

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వివరించిన హరేంధిర ప్రసాద్

పౌర సేవ‌ల మెరుగుద‌ల‌కు, ఫిర్యాదుల పరిష్కారానికి విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను రూపొందించి పార‌ద‌ర్శ‌క రీతిలో అవ‌లంబిస్తున్నామ‌ని, ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో విశాఖపట్నం జిల్లా పరిధిలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల నిర్వహణ విధానం గురించి ఆయ‌న‌ వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను ప్రతి వార్డు, ప్రతి సచివాలయం స్థాయిలో సమగ్రంగా విశ్లేషిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎక్కువగా ఫిర్యాదులు నమోదవుతున్నాయో గుర్తించి, ఒకే ప్రాంతం నుంచి పదేపదే వచ్చే సమస్యలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో నీటి లీకేజీ లేదా పైప్‌లైన్ దెబ్బతినడం వంటి సమస్యలపై పదేపదే ఫిర్యాదులు వస్తే, ఆ ప్రాంతానికి సంబంధించిన మొత్తం డేటాను విశ్లేషించి ప్రత్యేకంగా ఒక ఇన్సిడెంట్ లేదా టికెట్ సృష్టించి ఆ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని ఫిర్యాదులు, సేవలపై సిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ జరుగుతోందన్నారు. మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించిన సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఫిర్యాదు నిర్ణీత సమయంలో పరిష్కరించబడిందా లేదా అన్నది కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఒక స్థాయిలో సమస్య పరిష్కారం ఆలస్యమైతే, అది తదుపరి ఉన్నతాధికారులకు ఆటోమేటిక్‌గా ఎస్కలేట్ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందించామన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ స్పందించకపోతే సూపర్‌వైజర్‌కు, సూపర్‌వైజర్ స్పందించకపోతే అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ కు, అవసరమైతే తదుపరి ఉన్నత స్థాయికి సమస్య వెళ్లేలా హైరార్కీని పునర్నిర్వచించినట్లు వివరించారు. అదనంగా ఈ వ్యవస్థను పీటీఆర్ఎస్ తో అనుసంధానం చేసి రియల్ టైమ్ ట్రాకింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ప్రస్తుతం మనమిత్ర ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఇది పూర్తయితే వివిధ విభాగాల మధ్య సమన్వయం మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ అప్లికేషన్ ద్వారా పౌరులు యుటిలిటీ సేవలకు సంబంధించిన చెల్లింపులు, విద్యుత్ బిల్లులు, మున్సిపల్ సేవల ఫీజులు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు వంటి అనేక సేవలకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. పౌర సేవల విభాగంలో అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా సర్వీస్ సర్టిఫికెట్లు జారీ చేయడం, వివిధ ధృవీకరణ సేవలు కూడా ఈ అప్లికేషన్‌లో చేర్చినట్లు చెప్పారు.
ఏఐ ఆధారిత చాట్‌బాట్ ను కూడా అభివృద్ధి చేసినట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. మెనూలను ఉపయోగించడం కష్టంగా ఉన్నవారు కూడా చాట్‌బాట్ ద్వారా తమ సమస్యను సులభంగా తెలియజేయవచ్చన్నారు. చాట్‌బాట్ పౌరుల ప్రశ్నలను ఏఐ మోడల్ ద్వారా విశ్లేషించి ఫిర్యాదును నమోదు చేయడం లేదా సేవ కోసం అభ్యర్థనను నమోదు చేస్తుందని తెలిపారు. అనంతరం సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ జ‌న‌రేట్ అవుతుంద‌ని, దాని ద్వారా పౌరులు తమ అభ్యర్థన స్థితిని ట్రాక్ చేసుకోవచ్చన్నారు. ఈ వ్యవస్థలో పుష్ నోటిఫికేషన్ సౌకర్యం కూడా ఉందని, అత్యవసర పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు, వాతావరణ హెచ్చరికలు, విపత్తులకు సంబంధించిన సమాచారం వంటి విషయాలను వెంటనే పౌరులకు చేరవేయవచ్చని తెలిపారు. అదనంగా స్థానిక స్థాయిలో ప్రత్యేక హెచ్చరికలు, చెల్లింపు రిమైండర్లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా పౌరులకు పంపే సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version