కాపు యువసేన ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాపు యువసేన అధ్యక్షులు సేనాపతి వెంకటేష్, ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని మహానీయునికి నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు మాట్లాడినంతకాలం ఆయన మన మధ్యే జీవిస్తారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అనితరసాధ్యం” అని కొనియాడారు.
తెలుగు భాషాభివృద్ధికి, కళా–సాహిత్య వికాసానికి శ్రీకృష్ణదేవరాయలు చేసిన కృషి తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. యువతలో భాషాభిమానం, సాంస్కృతిక స్పృహ పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధుపడా రవి, పనింద్ర నాయుడు, భాస్కర్, చిరంజీవి చంటి తదితరులు, కవులు, కళాకారులు, భాషావేత్తలు, కాపు యువసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
