మహిళా కమిషన్ చైర్మన్ శైలజ సీరియస్
విశాఖ నగరంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధిత బాలికకు ఓ ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల వయసున్న పసికందుపై జరిగిన లైంగిక దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు నాగరిక సమాజానికి మచ్చ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రాయపాటి శైలజ విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని, నిందితుల వివరాలను రాయపాటి శైలజ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. చిన్నారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో నిందితులకు చట్టప్రకారం అత్యంత కఠిన శిక్షపడేలా.. మహిళా కమిషన్ పక్షాన పర్యవేక్షిస్తామని రాయపాటి శైలజ స్పష్టం చేశారు.
