Home Politics Andhra Pradesh మురుగు మయం హుకుంపేట… ‘మా ఊరిని కాపాడండి’ అంటూ గ్రామస్తుల ఆర్తనాదం

మురుగు మయం హుకుంపేట… ‘మా ఊరిని కాపాడండి’ అంటూ గ్రామస్తుల ఆర్తనాదం

0

రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామపంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై మురుగు నీరు ఏరులై పారుతుండగా, కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఎండకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే, వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీలు సక్రమంగా నిర్మించకపోవడంతో నీరు ఇళ్ల ముందే నిల్వవుతోంది. ఫలితంగా దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజూ మురుగు నీటిలోనే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
గ్రామాభివృద్ధి పేరుతో ఖర్చవుతున్న నిధులు వాస్తవంగా పనుల్లో కనిపించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని డ్రైనేజీ కాలువలు నిర్మించి, కొద్ది రోజుల్లోనే అవి మూసుకుపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, ఇప్పుడు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
“మా ఊరు మురుగు కూపంగా మారింది… మా పిల్లల ఆరోగ్యం కాపాడండి” అంటూ హుకుంపేట గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ పరిస్థితిపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version