Home Politics Andhra Pradesh మతం మారితే ఎస్సీ హోదా రద్దు

మతం మారితే ఎస్సీ హోదా రద్దు

0

ఎస్సీ, ఎస్టీ చట్టంతో రక్షణ పొందలేరు

హిందూ, బౌద్ధవం, సిక్కులు మారితే వర్తింపు

సుప్రీంకోర్టు సంచలన కీలక తీర్పు

గతంలో రాష్ట్ర హైకోర్టు తీర్పునకు సమర్థన

మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దు అవుతుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ అయిన వ్యక్తి ఎస్సీ&ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని భారత సర్వోన్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతంలో లేదు కుల వ్యవస్థ లేదని, మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి, ఆచరిస్తున్నప్పుడు, వారిని షెడ్యూల్డ్ కులానికి చెందినట్లు పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం నాడు సమర్థించింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలను ఆచరించే ఏ వ్యక్తినైనా షెడ్యూల్డ్ కులానికి చెందినవారిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఇతర మతంలోకి మారడం వల్ల షెడ్యూల్డ్ కుల హోదా తక్షణమే, పూర్తిగా రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగంలో పేర్కొన్న రూల్స్ ఇవే..

‘రాజ్యాంగంలో పేర్కొన్న (షెడ్యూల్డ్ కులాలు) 1950 నిబంధన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ ఉత్తర్వు కింద నిషేధం పూర్తిగా వర్తిస్తుందని కోర్టు గుర్తించింది. 1950 ఉత్తర్వులోని క్లాజ్ 3లో పేర్కొనని ఏ మతంలోకి మారినా, పుట్టుకతో సంబంధం లేకుండా ఎస్సీ హోదా తక్షణమే కోల్పోతారు. క్లాజ్ 3 ప్రకారం ఎస్సీగా పరిగణించని ఏ వ్యక్తికీ రాజ్యాంగం లేదా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చట్టాల కింద ఎటువంటి చట్టబద్ధమైన ప్రయోజనం, రక్షణ, రిజర్వేషన్ లేదా అర్హతను క్లెయిమ్ చేయలేరు. కనుక ఇతర మతంలోకి మారడంతో ఎస్సీగా కొనసాగలేరు. ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండవు. ఒక వ్యక్తి క్లాజ్ 3లో పేర్కొన్న మతం కాకుండా వేరే మతాన్ని ఆచరిస్తుంటే షెడ్యూల్డ్ కులానికి చెందినట్లు క్లెయిమ్ చేయలేరని’ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా చేస్తున్న ఒక వ్యక్తి, తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ కొందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు వచ్చింది. ఆ వ్యక్తి ఎస్సీ/ఎస్టీ చట్టం కింద రక్షణ కోరగా, ఆ పాస్టర్ క్రైస్తవ మతంలోకి మారి, ఆచరిస్తున్నందున ఆ చట్టం వర్తించదని నిందితులు కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు..

హైకోర్టు ఏప్రిల్ 30, 2025 నాటి ఉత్తర్వులో కుల వ్యవస్థ క్రైస్తవ మతానికి చెందినది కాదని, కనుక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని నిబంధనలు అతడికి వర్తించవని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఫిర్యాదుదారు దాఖలు చేసిన ఎస్సీ/ఎస్టీ చట్టం కింద చేసిన ఆరోపణలను హైకోర్టు జస్టిస్ హరినాథ్ ఎన్ కొట్టివేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ పాస్టర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ దీనిపై తీర్పు ఇచ్చింది. ‘ఈ కేసులో పిటిషనర్ క్రైస్తవ మతం నుండి తిరిగి తన మతంలోకి మారినట్లు లేదా ఎస్సీ వర్గం అతడిని తిరిగి స్వీకరించినట్లు ఎక్కడా లేదు. అందుకు విరుద్ధంగా పిటిషనర్ క్రైస్తవ మతాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్ద కాలంగా పాస్టర్‌గా పనిచేస్తూ, క్రమం తప్పకుండా ప్రార్థనలు నిర్వహిస్తున్నారని ఆధారాలు ఉన్నాయి. సంఘటన జరిగిన టైంలోనూ ఆయన ఒక ఇంట్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు అంగీకరించారు. ఇవన్నీ పరిశీలిస్తే, ఆయనను ఎస్సీగా పరిగణించలేం. మత మార్పిడి తరువాత ఎస్సీ హోదా కోల్పోతారని’ ధర్మాసనం స్పష్టం చేసింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version