రన్ అండ్ రైడ్ ద్వారా నగరంలో ఐక్యత, సామరస్యతకు ప్రతీకగా నిలుస్తోందని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌కే షెరీన్ బేగం అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఏర్పాటు చేసిన రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని ఆదివారం బీఆర్‌టీఎస్ రోడ్డులో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ లాంటి సుందర నగరంలో ఐక్యతా సందేశాన్ని ఈ రన్ అండ్ రైడ్ చాటుతోందన్నారు. యువత ఆరోగ్య వంతమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. సత్యసాయి బాబా అందించిన ప్రేమ, కరుణ, సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. సభాధ్యక్షత వహించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ రన్ అండ్ రైడ్ వల్ల కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, నిస్వార్ధ సేవకు ప్రతీక అయిన పుణ్య యాత్రగా పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న భగవాన్ సత్యసాయి బోధనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సేవాదళ్ సభ్యులు, యువ వాలంటీర్లు, సమన్వయకర్తల కృషిని అభినందించారు. విజయవాడ జిల్లా యంత్రాంగం, పోలీస్, రెవెన్యూ శాఖల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ యువ సమన్వయకర్త లక్ష్మీకాంత్ శర్మ, ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షులు విశ్వనాధం, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర, రాష్ట్ర సేవా సమన్వయకర్త కొమరగిరి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫిట్‌నెస్ కోచ్, జుంబా ఇన్‌స్ట్రక్టర్ బోదేశ్ కుమార్ ఉత్సాహభరితమైన వార్మప్ సెషన్ నిర్వహించారు. బాల వికాస్ వికాస్ విద్యార్ధుల సంగీత బృందం ఆకట్టుకునే ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. రన్‌లో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక టీ షర్టులు, రన్ అనంతరం అల్పాహారం అందజేశారు.
