Home Politics Andhra Pradesh రాజమహేంద్రవరం నుంచి గుంటూరు పయనం: అంబటి రాంబాబు ర్యాలీపై పోలీసుల అడ్డుకట్ట – ఉద్రిక్తత

రాజమహేంద్రవరం నుంచి గుంటూరు పయనం: అంబటి రాంబాబు ర్యాలీపై పోలీసుల అడ్డుకట్ట – ఉద్రిక్తత

0

రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి:
మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పయనం నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలో హైడ్రామా చోటుచేసుకుంది. ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
2023 సంక్రాంతి సందర్భంగా ‘లక్కీ డ్రా’ పేరుతో మోసం చేశారనే ఆరోపణలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో గుంటూరు కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ పొందిన అంబటికి ఇది మూడో కేసులో లభించిన బెయిల్. దీంతో ఆయన బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
విడుదల అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్వగృహంలో బస చేశారు. గురువారం ఉదయం గుంటూరు వెళ్లేందుకు భారీ ర్యాలీగా బయలుదేరేందుకు ఏర్పాట్లు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లా నుంచి వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు.
అంబటి వాహనం కదిలిన వెంటనే వెనుకనుంచి ర్యాలీగా బయలుదేరిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, మూడు కార్లకు మించి కాన్వాయ్ అనుమతించబోమని స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి, “ర్యాలీకి అనుమతి ఇస్తే కారులో వెళ్తా… లేదంటే పాదయాత్రగా వెళ్తా” అంటూ హెచ్చరించారు.
పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో స్పందించిన ఆయన, 18 రోజులపాటు రిమాండ్‌లో ఉండి బయటకు వచ్చిన తనకు స్వజిల్లాకు శాంతియుతంగా వెళ్లేందుకు కూడా అనుమతి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయికి చేరాయో ప్రజలు గమనించాలని వ్యాఖ్యానించారు. తన ఇంటిపై దాడి జరిగినప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఇక వైసీపీ శ్రేణులు నినాదాలతో ఆందోళనకు దిగగా, పోలీసులు ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. అనంతరం అంబటి మూడు కార్ల కాన్వాయ్‌తో గుంటూరు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వెనుకనుంచి కలిసే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్తత కొనసాగింది.
రాజమహేంద్రవరం నుంచి గుంటూరు వరకు అంబటి కాన్వాయ్‌కు అడుగడుగునా పోలీసుల నిర్బంధం నెలకొనడంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version