రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ భవన పనుల పరిశీలన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీ అయ్యప్ప బాలసాయి నర్సరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విమానాశ్రయాన్ని హరితహారంగా మార్చే దిశగా విలువైన మొక్కలు నాటడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. నూతన టెర్మినల్ మార్చి 31లోగా పూర్తవుతుందని, అది ప్రారంభమైతే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పచ్చదనం వల్ల పరిసర వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో విమానాశ్రయ ఎ.జి.ఎం. శ్రీనివాసు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి, అయ్యప్ప బాలసాయి నర్సరీ ప్రొప్రైటర్ ఉప్పాడ కుమారస్వామి, రినాటస్ ఎం.డి.తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన మరింత పెరిగిందని పాల్గొన్నవారు తెలిపారు.
