నీతి అయోగ్ సదస్సులో అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘నిర్మాణ్’ పేరుతో చేపట్టిన ఈ సమగ్ర విద్యా వ్యూహం గురించి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ విశాఖపట్నంలో సోమవారం జరిగిన నీతి ఆయోగ్ ప్రాంతీయ సెమినార్‌లో వివరించారు.
జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో ఉన్న భౌగోళిక సవాళ్లు, మొదటి తరం విద్యార్థుల విద్యా సమస్యలను గుర్తించిన కలెక్టర్, వాటిని అధిగమించేందుకు మూడు ప్రధాన విభాగాలతో ‘నిర్మాణ్’ను రూపొందించారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల్లో ప్రాథమిక చదువు, గణిత నైపుణ్యాలను పెంపొందించడం.
సూపర్-50: 10వ తరగతిలో ప్రతిభ కనబరిచే విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడం. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భవిష్యత్తు కెరీర్ మార్గదర్శకత్వం అందించడం. గత ఏడాది జూన్‌లో నిర్వహించిన బేస్‌లైన్ పరీక్షల్లో విద్యార్థుల విద్యా స్థాయి అత్యంత తక్కువగా ఉండటాన్ని గమనించిన అధికారులు, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 22 మండలాల్లోని సుమారు 3 వేల పాఠశాలలకు చెందిన 6 వేల మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా 21 ప్రత్యేక మాడ్యూల్స్‌తో వినూత్న బోధనా పద్ధతులను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చదువు, గణితం, భాషా నైపుణ్యాల్లో విద్యార్థులను మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం” అని కలెక్టర్ దినేశ్ కుమార్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఈ కార్యక్రమం దిక్సూచిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
