Home Politics Andhra Pradesh తిరుమల దర్శనాలకు కొత్త చట్టం

తిరుమల దర్శనాలకు కొత్త చట్టం

0

డిక్లరేషన్ పై ఖచ్చితంగా ఉండాలని నిర్ణయం

స్వర్ణ దేవాలయం తరహాలో నియమాలు

రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిక్లరేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఎవరైనా అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఇప్పటివరకు ఈ నిబంధన ఉన్నా అంతగా అమలు కావడం లేదు. స్వచ్చంధంగా కొంతమంది డిక్లరేషన్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కొంతమంది డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శించుకుంటున్నారు. ఇక నుంచి ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల ఆలయం పవిత్రతను రక్షించేందుకు ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ కల్తీ అంశం అసెంబ్లీని కుదిపేస్తుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సభలో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో పలువురు మంత్రులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలో ఎలాంటి అపచారాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణ దేవాలయం తరహాలోనే తిరుమలలోనూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చట్టం అమలు చేయడం వల్ల తప్పు చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంటుంది.

తిరుమలలోనూ కొత్త చట్టం
స్వర్ణ దేవాలయం చట్టంపై అధ్యయనం చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. అనంతరం బిల్లును ఆమోదించాక కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఇటీవల తిరుమల చుట్టూ అనేక వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త చట్టంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. గత ఏడాది కాలంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఇప్పటికే సిట్ విచారణ చేపట్టి కల్తీ జరిగినట్లు నిర్ధారించింది. వైసీపీ మాత్రం ఎలాంటి కల్తీ జరగలేదని వాదిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం చుట్టూ రాజకీయ వేడి నెలకొంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version