ఫ్లై ఓవర్ ప్రాజెక్టు పనులు పూర్తి
నేటి నుంచి అన్ని మార్గాల్లో అనుమతి
విశాఖపట్నం, ఫిబ్రవరి 16, జయజయహే : విశాఖకు ముఖ ద్వారమైన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 150 కోట్లతో సర్వాంగసుందరంగా నిర్మించినట్టు ఎమ్మెల్యే గణబాబు అన్నారు. సోమవారం ఎన్‌ఏడీ ఆర్వోబీ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్‌ఏడీ జంక్షన్‌లో 2017 వరకూ ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండేవి కాదన్నారు. ఇక్కడ సిగల్ దాటితే ఓ గండం గడచినట్టేనన్నట్టు భావించేవారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు దీర్ఘదృష్టితో ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నామని ఈ కారణంగా అంతరాయం లేని గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుందన్నారు. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విశాఖలో మౌళిక సదుపాయాల కల్పనకే పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజక వర్గాల వారీగా రహదారులను అభివృద్ది చేస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, ఐటీ కంపెనీల రాకతో నగరంలో రద్దీ మరింత వేగంగా పెరిగే అంచనాల నేపధ్యంలో రహదారులను మరింత వేగంగా పూర్తి చేసే పనిని చేపడుతున్నామన్నారు. వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ ఈ ఆర్వోబీకి 2021లోనే అనుమతులు వచ్చినా రైల్వే నుంచి కొన్ని అనుమతులు పెండింగ్‌లో ఉండడం కారణంగా ఫ్లై ఓవర్ నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణీకులకు ఎలాంటి ఆటంకం లేకుండా వేగగా గమ్యస్థానానికి చేరుకునేలా ఈ మార్గం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు, వీఎంఆర్‌డిఏ జేసీ రమేష్, కార్యదర్శి మురళీ కృష్ణ, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్; మధుసూదనరావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు దుర్గా ప్రసాద్, రామరాజు, జనసేన పశ్చిమ ఇన్‌ఛార్జి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
