Home Politics Andhra Pradesh విద్యుత్ ప్రమాద బాధిత విద్యార్థులను పరామర్శించిన మార్గాని భరత్

విద్యుత్ ప్రమాద బాధిత విద్యార్థులను పరామర్శించిన మార్గాని భరత్

0

రాజమండ్రి నగరంలోని అనుశ్రీ థియేటర్ సమీపంలోని ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న ఒక పాఠశాలలో చదువుతున్న ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు విద్యుత్ ఘాతానికి గురై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మార్గాని భరత్ రామ్ ఆసుపత్రులకు చేరుకుని బాధితులను పరామర్శించారు.
దానవాయిపేటలోని సురక్ష హాస్పిటల్‌లో 15వ వార్డుకు చెందిన యన్. రమేష్, దివాన్ చెరువులోని కేశవ హాస్పిటల్‌లో 27వ వార్డుకు చెందిన ఉజ్వల ఈశ్వర సాయి చికిత్స పొందుతున్నారు. పాఠశాల సమయం లో మామిడికాయలు కోయడానికి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు, అధ్యాపకులు మందలిస్తారనే భయంతో గోడ దూకే ప్రయత్నంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం.
విద్యాశాఖ అధికారులు వచ్చి తలా రూ.10 వేల చొప్పున వైద్య ఖర్చుల కోసం అందించి వెళ్లిపోయారని బాధితుల తల్లిదండ్రులు తెలిపారు. ప్రైవేట్ భాగాల్లో కూడా తీవ్ర గాయాలు కావడంతో పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, వరుస ఘటనలతో ప్రజలు విలవిలలాడుతున్నా ప్రభుత్వం స్పందన లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడి ప్రభుత్వ తరఫున పూర్తి వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇటీవలి కల్తీ పాల ఘటన, వేట్లపాలెం బాంబు పేలుడు ఘటనలతో పాటు విద్యార్థుల ప్రమాదం వంటి సంఘటనలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధిత విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పీత రామకృష్ణ మిత్రబృందం సభ్యులు వంగల మహాలక్ష్మి, దుర్గారావు, 29వ వార్డు ఇంచార్జి మునీశ్వరరావు, రేగుళ్ల శ్రీధర్‌లను భరత్ ప్రత్యేకంగా అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version