అవకాశాలు మరింత పెరుగుతాయి
వైసీపీని గద్దె దించటం కోసమే సీట్లపై రాజీ
కూటమిలో సమస్యలుంటే పరిష్కరించుకోవాలి
గతంలో కంటే సభ్యత్వ నమోదు పెరిగింది
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమీక్ష
నియోజకవర్గాల పునర్విభజనతో జనసేనకు అవకాశాలు మరింతగా పెరుగుతాయని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. అలానే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పవన్ స్వాగతించారు. 2024 ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపటం కోసం సీట్ల విషయంలో రాజీపడాల్సి వచ్చిందని తెలిపారు. కూటమి కోసం అప్పుడు తగ్గినా ఈసారి నియోజకవర్గాల పునర్విభజన రూపంలో మంచి అవకాశం ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సమస్యల గురించి చర్చించారు. అక్కడ కూటమి పార్టీల నేతలతో సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జనసేన పార్టీ బలోపేతం కోసం జిల్లా, మండల స్థాయి కమిటీల విషయంపై సమావేశంలో చర్చించారు. అదే విధంగా సభ్యత్వ నమోదుపైన పవన్ కల్యాణ్ సమీక్షించారు. సభ్యత్వ నమోదు బాగా జరిగిందని గతేడాది కంటే సభ్యులు పెరిగారని పవన్ అన్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలో 15 లక్షల మేర సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వ నమోదు గడువును మరికొన్ని రోజులు పెంచడంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు. కాగా ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అల్లూరి జిల్లాలో గిరిజనుల మధ్య నిర్వహించారు. వారికి మరింత దగ్గర అవ్వాలనే క్రమంలో గిరిజనుల చెంతకు వచ్చారు. అడవితల్లి బాట పథకంలో భాగంగా నిర్మించిన రహదారులు పరిశీలనతో గిరిపుత్రుల బాగోగులు తెలుసుకునేందుకు ఆయన అల్లూరి జిల్లాలో పర్యటించారు. ముుందుగా అల్లూరి జిల్లా ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన పయనమైన పవన్ కల్యాణ్ మార్గమధ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పవన్ వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంటు ఇంఛార్జి గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
