Home Politics Andhra Pradesh రైతుల పేరుతో జగన్ అబద్ధాల రాజకీయాలు

రైతుల పేరుతో జగన్ అబద్ధాల రాజకీయాలు

0

రైతుల కష్టాలపై రాజకీయాలు చేయొద్దని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక
– రైతుల కోసం పనిచేయని వారు ఇప్పుడు విమర్శలా? అంటూ మండిపాటు
– గత ఐదేళ్లు రైతులు గుర్తుకురాలేదు… ఇప్పుడు ఈ నాటకం ఎందుకు?
– రైతన్నల పేరుతో జగన్ రాజకీయ డ్రామాలు ఇక సాగవు
– రైతుల్ని మోసం చేసిన చరిత్ర జగన్‌ది – మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

అమరావతి, (జయ జయహే )రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల సమస్యలపై ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రైతుల పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం జగన్‌కు అలవాటైపోయిందని ఆయన ఓ ప్ర‌క‌ట‌న‌లో ఘాటుగా విమర్శించారు. గత ఐదేళ్లలో రైతు భరోసా పేరుతో పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్, తన పాలనలోనే రైతులకు ఇవ్వాల్సిన అనేక చెల్లింపులను నిలిపివేసిన విషయం ప్రజలు మరిచిపోలేదని మంత్రి అన్నారు. ఇప్పుడు అదే విషయంపై నైతిక హక్కు ఉన్నట్లు మాట్లాడటం జగన్ రాజకీయ కపటత్వానికి నిదర్శనమన్నారు. రైతులకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందని చెప్పారు.

గత ప్రభుత్వ కాలంలో రైతు భరోసా పేరుతో రాష్ట్రం రూ.13,500 ఇస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్రం నుంచి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి, కేంద్రం ఇచ్చిన రూ.6,000ను కలిపి మొత్తం రాష్ట్రం ఇచ్చినట్లుగా ప్రకటించారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం సంవత్సరానికి రూ.20,000ను మూడు విడతలుగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా మొత్తం రూ.6,309.44 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేశామని, ఈ నెల 13వ తేదీన మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పంట బీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో జగన్ వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తున్నారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో బీమా ప్రీమియంలు చెల్లించకపోవడంతో మూడు సీజన్లకు సంబంధించిన రూ.1,990.06 కోట్ల ఆర్థిక భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందని ఆయన వెల్లడించారు. ఇటీవల సంభవించిన తుఫాన్లకు సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే రూ.25 కోట్లు, రూ.34 కోట్లు, రూ.310 కోట్ల వరకు రైతులకు నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. ఇటీవల వచ్చిన మొందా తుఫాన్‌కు సంబంధించిన నష్టాల సర్వే పూర్తయిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సుమారు రూ.588 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 2019–24 మధ్య రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు. మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటల ధరల విషయంలో కూడా జగన్ రాజకీయ నాటకం ఆడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధరలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, వాటిని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకుండా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. రైతులకు మేలు చేశామని చెప్పుకునే జగన్ పాలనలోనే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని మంత్రి గుర్తు చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు మాట్లాడటం రాజకీయ స్వార్థమే తప్ప రైతుల పట్ల చిత్తశుద్ధి కాదన్నారు. రైతుల పేరుతో అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసత్య ప్రచారాలకు రైతులు కూడా సమాధానం చెబుతారని ఆయన స్పష్టం చేశారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version