Home Politics Andhra Pradesh మైనారిటీలంటే జగన్ కు చిత్తశుద్ధి లేదు

మైనారిటీలంటే జగన్ కు చిత్తశుద్ధి లేదు

0

సొంత జిల్లా లో కడప హజ్ హౌస్ కు ఒక్క పైసా ఇవ్వలేదు*

మైనారిటీల పట్ల జగన్ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డ మంత్రి ఫరూక్

మైనారిటీలంటే జగన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విరుచుకుపడ్డారు. సొంత జిల్లా కడపలో హజ్ హౌస్ నిర్మాణానికి టిడిపి ప్రభుత్వ హయాంలో రూ. 25 కోట్లు మంజూరు చేసి,రూ.13 కోట్లతో భవన నిర్మాణం, సౌకర్యాలు ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పెండింగ్ పనుల పూర్తికి ఒక పైసా కూడా విదల్చలేదని మంత్రి ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో హజ్ హౌస్ నిర్మాణం, హజ్ యాత్రికులకు ఏర్పాట్లపై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఫరూక్ సమాధానం ఇచ్చారు.*

*హైదరాబాద్ హజ్ హౌస్ నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం*

*ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రత్యేకంగా జీవో ఇచ్చి, అసెంబ్లీలో పాస్ చేసి పదకొండు అంతస్తులతో ముంబైలో ఉన్న సెంట్రల్ హజ్ హౌస్ కు ధీటుగా చంద్రబాబు నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా హజ్ హౌస్ నిర్మించడం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పట్లో హైదరాబాదులో ఎంబార్కేషన్ సెంటర్ ఉండేది కాదని, అప్పటి ప్రధాని వాజ్ పేయి గారితో మాట్లాడి,ప్రత్యేక అపాయింట్మెంట్ ఇప్పించి, జస్వంత్ సింగ్ గారిని పిలిపించి కేవలం పది నిమిషాల వ్యవధిలో ఎంబార్కేషన్ సెంటర్ మంజూరు చేయించిన చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, మైనారిటీ పట్ల ఉన్న నిబద్ధత ను మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. నిష్ణాతులైన ఆర్కిటెక్ లతో ప్లాన్ రూపొందించి నిర్మించిన హైదరాబాద్ హజ్ హౌస్ ను ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో హజ్ హౌస్ ల నిర్మాణాలు ప్రారంభించారన్నారు.*

*జగన్ వ్యవహార శైలిపై ధ్వజమెత్తిన మంత్రి*

*రాష్ట్రం విడిపోయిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఫరూక్ అన్నారు.అందుకు అనుగుణంగానే కడప జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు జిల్లా కేంద్రమైన కడపలో హజ్ హౌస్ నిర్మాణానికి చంద్రబాబు రూ. 25 కోట్లు మంజూరు చేశారన్నారు.రూ.13 కోట్లు ఖర్చు చేసి భవన నిర్మాణం, ఇతర పనులు చేసినప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ తన సొంత జిల్లాలో హజ్ హౌస్ పెండింగ్ పనుల పూర్తికి ఒక్క రూపాయి కూడా విదల్చలేదని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ ఆ జిల్లా వాసి కాదా..? మైనారిటీలు అంటే ప్రేమ ఉండాలి కదా..? పులివెందులలో కూడా ముస్లిం మైనారిటీలు చాలామంది ఉన్నారు..! కదా..కానీ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పని కూడా చేయలేదని మంత్రి ఫరూక్ ఘాటుగా స్పష్టం చేశారు. హజ్ భవనంలో కరోనా పేషెంట్లను తీసుకొచ్చి అందులో పెట్టారే తప్ప ఏ మాత్రం అభివృద్ధి చెయ్యలేదని, దీన్నిబట్టి మైనారిటీల పట్ల జగన్ వైఖరి, ఎంత ప్రేమ ఉందో స్పష్టం అవుతున్నదని మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కడప హజ్ హౌస్ ను పూర్తి చేసే బాధ్యత తిరిగి మనమీదే పడిందని, చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.*

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version